- హరీశ్‌రావు సిట్ విచారణపై బీఆర్ఎస్ నేతల ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన పేరుతో ప్రతిపక్ష నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంగళవారం హరీశ్ రావు సిట్‌విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్నేతలు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని హరీశ్ రావు బయటపెట్టగానే సిట్ నోటీసులు పంపారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలంటూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండేండ్లుగా ఏం జరుగుతున్నదో ప్రజలు చూస్తున్నారని, సీరియల్లాగా రోజుకో కేసు పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందనే భయంతో కేసులు పెడుతున్నారని తెలిపారు. రెండేండ్లుగా మంత్రులు కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కక్షసాధింపులో భాగంగానే హరీశ్‌రావుకు సిట్నోటీసులు ఇచ్చారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్‌లని, కాంగ్రెస్ అంటే స్కామ్‌ల ప్రభుత్వమని విమర్శించారు.
