ఇండియాలో బంగ్లా టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా.. లేదా..? బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ ఆన్సర్ ఇదే

ఇండియాలో బంగ్లా టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా.. లేదా..? బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ ఆన్సర్ ఇదే

ఢాకా: ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న 2026 టీ20 వరల్డ్ కప్‎లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధం నెలకొంది. భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో ఆడలేమని బంగ్లా తేల్చి చెప్పింది. తమ మ్యాచులను ఇండియా బయట తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని రిక్వెస్ట్ చేసింది. అయితే.. బంగ్లా అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ సమయంలో వేదికను మార్చలేమని తెగేసి చెప్పింది. వరల్డ్ కప్ ఆడతారో లేదా ఇక మీరే డిసైడ్ చేసుకోవాలని 2026, జనవరి 21వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్‎లో పాల్గొంటుందా లేదా అనే దానిపై ఆ టీమ్ కెప్టెన్ లిటన్ దాస్‎ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ, బీసీబీ మధ్య కొనసాగుతోన్న వివాదంలో బోర్డు వైఖరితో మీరు ఏకీభవిస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దీనిపై తాను మాట్లాడటానికి ఏం లేదన్నాడు లిటన్ దాస్‎. అంతేకాకుండా ఈ అంశంపై తాను డిస్కస్ చేయడం కూడా సురక్షితం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read :  న్యూజిలాండ్‌తో తొలి టీ20.. ప్లేయింగ్ 11లో కిషాన్

మనం ప్రపంచ కప్‌కు వెళ్తున్నామని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా..? ఆ విషయం మీకు తెలియదు నాకు తెలియదని అన్నాడు. ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉందని.. బంగ్లా ప్రపంచ కప్‌కు వెళ్తుందో లేదో మాకు కూడా ఇంకా ఖచ్చితంగా తెలియదని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి నిరాకరించే ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల సమ్మతిని తీసుకోలేదని తెలిపాడు. ఈ విషయంలో బోర్డు తనతో ఎలాంటి చర్చలు జరపలేదని క్లారిటీ ఇచ్చాడు. 

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‎లో బంగ్లాదేశ్ ఆడే సూచనలు కనిపించడం లేదు. భద్రతా కారణాలు చూపిస్తూ ఇండియాలో అడుగు పెట్టమని ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి చాలా సార్లు చెప్పింది. అయితే ఐసీసీ బంగ్లాదేశ్‎కు మరోసారి ఆలోచించుకోమని అవకాశం ఇచ్చింది. బుధవారం (జనవరి 21) లోపు తమ సమాధానాన్ని చెప్పాల్సిందిగా డెడ్ లైన్ విధించింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మంగళవారం (జనవరి 20) ఖరాఖండిగా చెప్పారు. 

వరల్డ్ కప్‎లో తమ స్థానాన్ని వేరే జట్టుతో రీప్లేస్ చేస్తారనే  బెదిరింపు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ జట్టు ఇండియాకు వచ్చి క్రికెట్ ఆడదని నజ్రుల్ స్పష్టంగా చెప్పారు. నజ్రుల్ విలేకరులతో మాట్లాడుతూ.."భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి ఐసీసీకి తలొంచి మాపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంది. షరతులు విధించడం ద్వారా మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము ఆ షరతులను అంగీకరించము". అని నజ్రుల్ అన్నారు. ఐసీసీ విధించిన గడువుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉండడంతో నజ్రుల్ తమ నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పుకొచ్చాడు.