టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్ తో జరగబోయే తొలి టీ20 ప్లేయింగ్ 11 లో స్థానం దక్కించుకున్నాడు. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో కిషాన్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. మంగళవారం (జనవరి 20) విలేఖరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తొలి టీ20లో కిషాన్ ఆడుతున్నట్టు స్పష్టం చేశాడు. మూడో స్థానంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బ్యాటింగ్ చేస్తాడని సూర్య ధృవీకరించాడు. కిషాన్ ప్లేయింగ్ 11లోకి రావడంతో శ్రేయాస్ అయ్యర్ కు నిరాశ తప్పేలా లేదు.
వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ 26 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. 2023 నవంబర్ లో చివరిసారి టీమిండియా తరపున ఆడిన ఈ జార్ఖండ్ వీరుడు.. రెండేళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన కిషాన్.. టీమిండియాలోకి రావడంతో ఫామ్ లో లేని గిల్ పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్ వరకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్.. ఒక్కసారిగా జట్టులో చోటు కోల్పోతే మరోవైపు కిషాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లో కిషాన్ ఏకంగా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం విశేషం.
ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరగదీసిన కిషాన్:
ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషాన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో మొత్తం 57.44 యావరేజ్ తో 517 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 200 ఉండడం విశేషం. జార్ఖండ్ తరపున ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో చెలరేగి ఆడాడు. గురువారం (డిసెంబర్ 18) పూణే వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాపై బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు ఏకంగా 10 సిక్సర్లు ఉన్నాయి. వికెట్ కీపర్ కావడం కిషాన్ కు మరో అడ్వాంటేజ్.
న్యూజిలాండ్ తో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్
