John Abraham Diet: జాన్ అబ్రహాంకి ఓవర్ ఫిట్నెస్ కష్టాలు.. కూరగాయలు తిన్నా జీర్ణం కావడం లేదట!

John Abraham Diet: జాన్ అబ్రహాంకి ఓవర్ ఫిట్నెస్ కష్టాలు.. కూరగాయలు తిన్నా జీర్ణం కావడం లేదట!

బాలీవుడ్‌లో కఠినమైన ఫిట్‌నెస్ నియమాలు, అపారమైన క్రమశిక్షణతో జీవించే నటుల్లో జాన్ అబ్రహాం ముందువరుసలో ఉంటారు. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన జాన్, ఎన్నో ఏళ్లుగా ఫిట్‌నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఫిట్‌నెస్ విషయంలో ఆయన ఎప్పుడూ డిసిప్లిన్‌ను వదలలేదన్న విషయం సినీ వర్గాల్లో తరచూ వినిపిస్తుంటుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహాం ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జాన్ అనుసరిస్తున్న కఠినమైన డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయిందని చెప్పారు. అందుకే ఇప్పుడు బెండకాయ (భిండి), వంకాయ (బైగన్) వంటి కూరగాయలు తిన్నా జాన్‌కు కడుపు జీర్ణ సమస్యలు వస్తాయని వెల్లడించారు.

ఎందుకంటే, జాన్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నేను నాలుగు రకాల ఆహారాలే తినమని చెబితే, అవే తింటాడు. మిగతావాటిని తాకడు కూడా. అంత కఠినంగా ఉంటాడు” అని వినోద్ అన్నారు. కొన్నిసార్లు కాస్త రిలాక్స్‌గా తినమని చెప్పినా, జాన్ పూర్తిగా నిరాకరించేవాడని ఆయన చెప్పారు.

ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ.. “ఒకసారి షూటింగ్‌లో ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె, జాన్ స్నేహితురాలిగా వచ్చారు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఆహారం అంతా అయిపోయిందని ఆమె నాతో చెప్పింది. కానీ జాన్ ఆహారాన్ని తాకడని నాకు 100 శాతం నమ్మకం ఉంది అని నేను ఆమెకు చెప్పాను” అని వినోద్ వివరించారు.

జాన్ డైట్ శరీరంపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ,

“జాన్ చక్కెరను అస్సలు తాకడు. పూర్తిగా మానేయొద్దని నేను చెప్పాను. ఎందుకంటే పొరపాటున తీసుకుంటే దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నేళ్లుగా ఇంత కఠినంగా డైట్ పాటించడం వల్ల ఇప్పుడు వంకాయ లేదా బెండకాయ తింటే అతని కడుపు జీర్ణించుకోలేకపోతుంది. శరీరం ఒక నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే, అకస్మాత్తుగా మార్పు వస్తే జీర్ణ సమస్యలు వస్తాయి” అన్నారు.

అలాగే, ప్రసవానంతరం శిల్పా శెట్టీ బరువు తగ్గుదలపై వచ్చిన ఆరోపణలపై కూడా వినోద్ స్పందించారు. “శిల్పా శెట్టీ నా వద్దకు వచ్చినప్పుడు ఆమెకు 30–35 కిలోలు బరువు పెరిగింది. మూడునెలల్లోనే ఆ బరువును పూర్తిగా తగ్గించాం. ఆ తర్వాత ఆమె ‘నచ్ బలియే’ రియాలిటీ షోలో కనిపించింది. అప్పుడు చాలామంది ‘సర్జరీ చేయించుకుంది’ అని అన్నారు. కానీ మేము చేసిన కఠినమైన కృషి గురించి ఎవ్వరూ మాట్లాడరు. అది పూర్తిగా సహజమైన విధానమే” అని స్పష్టం చేశారు.