- సిట్ చీఫ్ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణపై సిట్ చీఫ్, సీపీ సజ్జనార్ స్పందించారు. హరీశ్‌రావు కుమారుడి విమాన ప్రయాణం ఉన్నందున మంగళవారం విచారణ ముగించామన్నారు. అవరసమైతే మళ్లీ పిలుస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారిస్తున్నారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. సిట్ విచారణపై తప్పుడు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో మాత్రమే హరీశ్ రావును పిలిపించి ప్రశ్నించామని తెలిపారు.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం వారిపై నిఘా పెట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని హరీశ్‌రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన చార్జ్ షీట్ కూడా దాఖలు చేశామని.. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు.
