షిప్పింగ్ కంపెనీలకు అమెరికా గ్యారెంటీ.. రూ.లక్షా 80వేల కోట్లతో ఇన్సూరెన్స్

షిప్పింగ్ కంపెనీలకు అమెరికా గ్యారెంటీ.. రూ.లక్షా 80వేల కోట్లతో ఇన్సూరెన్స్

ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతలు భారీగా పెరిగిన వేళ.. ప్రపంచ క్రూడ్ ఆయిల్ రవాణాపై నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్ రవాణా చేసే షిప్‌లకు భద్రతతో కూడిన భరోసా కల్పించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం 20 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.లక్షా 80వేల కోట్లు రీఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం వాటా ఇరాన్-ఒమన్ మధ్య ఉండే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధి గుండానే సాగుతుంది. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల ప్రయాణం దాదాపు నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో షిప్పులకు జరిగే నష్టంపై ఇన్సూరెన్స్ కంపెనీలు వెనకడుగు వేస్తుండటంతో, షిప్పింగ్ వ్యాపారం స్తంభించిపోయింది. దీంతో డీఎఫ్‌సీని రంగంలోకి దించిన ట్రంప్, సముద్ర వాణిజ్యానికి పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్, ఆర్థిక గ్యారెంటీలను అందించాలని ఆదేశించారు.

ALSO READ : ఇరాన్ డ్రోన్ అటాక్.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ క్లోజ్

ఈ కొత్త వ్యవస్థ కింద షిప్పుల్లోని మెషిన్లు, వాటిలో ఉండే సరుకుకు రక్షణ కల్పిస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, షిప్ యజమానులకు నష్టపరిహారం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమెరికా భరోసా ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. సుమారు రూ.లక్షా 80వేల కోట్ల భారీ మొత్తంతో కూడిన ఈ ఇన్సూరెన్స్ రక్షణ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అదుపు తప్పకుండా ఉండటానికి, షిప్పింగ్ మళ్లీ పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.