ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి, సమాజంలో వారికి సమాన గౌరవం, హక్కులు దక్కాలని పోరాడేందుకు ఈ రోజు ఒక వేదికగా నిలుస్తుంది.
2026 థీమ్ ఏమిటి:
ఈ ఏడాది మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం Give To Gain. దీని అర్థం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా విరాళం ఇవ్వడానికి పిలుపు... ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం. మహిళలకు చదువు, శిక్షణ, మంచి అవకాశాలు కల్పించడం, మగవారితో సమానంగా జీతం, గౌరవం ఇవ్వడం, కేవలం డబ్బు రూపంలోనే కాకుండా.. మనకున్న జ్ఞానాన్ని, వనరులను పంచుకోవడం ద్వారా మహిళలను పైకి తీసుకురావడం. మహిళలు అభివృద్ధి చెందితే, మొత్తం సమాజమే పురోగమిస్తుంది అనేది ఈ ఏడాది సందేశం.
ఈ రోజుకి ఉన్న చరిత్ర, ఎలా మొదలైందంటే :
మహిళా దినోత్సవం వెనుక ఒక పెద్ద పోరాటమే ఉంది. రికార్డుల ప్రకారం, ఫిబ్రవరి 28, 1909న అమెరికాలోని 'సోషలిస్ట్ పార్టీ' ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తొలిసారిగా 'మహిళా దినోత్సవం' నిర్వహించారు. జర్మనీకి చెందిన సామాజిక కార్యకర్త క్లారా జెట్కిన్, మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని ప్రతిపాదించారు. క్లారా జెట్కిన్ ప్రతిపాదనను అంగీకరించిన తర్వాత, 1911 మార్చి 19న జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని, పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు. 1975లో ఐక్యరాజ్యసమితి (UN) దీనిని అధికారికంగా గుర్తించడంతో ప్రపంచమంతా మార్చి 8న జరుపుకోవడం అలవాటైంది.
►ALSO READ | Womens Day 2026 : మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనక రీజన్ ఏంటీ..?
ఈ రోజు ఎందుకు ముఖ్యం:
మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక బాధ్యత. విజయాల గుర్తింపు.. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా మహిళలు పడుతున్న కష్టాన్ని గుర్తించడం. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్షను అరికట్టడం. ఆస్తిలో వాటా, చదువుకునే స్వేచ్ఛ, నిర్ణయాలు తీసుకునే అధికారం అందరికీ సమానంగా అందాలని గుర్తుచేయడం.
