కాలేజీలకు ఫైన్లు రద్దు చేసి.. అఫిలియేషన్ ఇవ్వాలి : టీపీజేఎంఏ

కాలేజీలకు ఫైన్లు రద్దు చేసి.. అఫిలియేషన్ ఇవ్వాలి : టీపీజేఎంఏ
  •     ఫేక్ ఎన్‌‌వోసీలపై సమగ్ర విచారణ జరిపించాలి: టీపీజేఎంఏ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై విధించిన భారీ జరిమానాలను తక్షణమే రద్దు చేసి, నిలిపివేసిన అఫిలియేషన్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీష్ డిమాండ్ చేశారు. ఫైర్ ఎన్‌‌వోసీల వ్యవహారంలో గతంలో తప్పు చేసిన అధికారులను వదిలేసి యాజమాన్యాలను బలిచేయడం దారుణమన్నారు. ఫేక్ ఎన్‌‌వోసీల వ్యవహారంలో అసలైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  

మంగళవారం ఆయన నాంపల్లిలోని టీపీజీఎంఏ స్టేట్ ఆఫీసులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.  ఇంటర్ బోర్డు ఆఫీసర్ల తీరుతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ మిక్స్‌‌డ్ ఆక్యుపెన్సీ, ఫైర్ ఎన్‌‌వోసీ అంటూ కాలేజీలపై రూ.5 లక్షల వరకు భారీ జరిమానాలు వేయడం సరికాదన్నారు. ఫేక్ ఎన్ఓసీల దందాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అసలు సూత్రధారులు ఎవరో బయటపడతారని స్పష్టం చేశారు. జూన్ నెలలోనే ప్రవేశాలు ముగిసినప్పటికీ, ఇప్పుడు అఫిలియేషన్ల పేరుతో పేచీలు పెట్టడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.

టాస్క్‌‌ఫోర్స్ ఆఫీసర్లు హద్దులు దాటుతున్నరు 

తనిఖీల పేరుతో టాస్క్‌‌ఫోర్స్ అధికారులు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని గౌరీసతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలు కట్టే ఫీజుల ద్వారా ఇంటర్ బోర్డుకు ఏటా రూ.45 నుంచి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతుండగా.. ఆ నిధులను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారని ప్రశ్నించారు. బోర్డు ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. సానుకూల నిర్ణయం రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని గౌరీసతీష్ హెచ్చరించారు.