మమ్ముట్టి-మోహన్‌లాల్ మూవీకి థియేటర్ల షాక్.. కేరళలో 'పేట్రియాట్' ప్రదర్శన నిలిపివేత?

మమ్ముట్టి-మోహన్‌లాల్ మూవీకి థియేటర్ల షాక్.. కేరళలో 'పేట్రియాట్' ప్రదర్శన నిలిపివేత?

మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ నటులు మమ్ముటి, మోహన్ లాల్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే. వీరిద్దరూ దాదాపు దశాబ్దం తర్వాత స్క్రీన్ పంచుకుంటున్నారు. ఈ కాంబోలో  వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేశాయి. కానీ వారు కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పేట్రియాట్' (Patriot) విడుదల ముందే పెను వివాదంలో చిక్కుకుంది. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ సినిమాపై కేరళ థియేటర్ల యజమానుల సంఘం (FEUOK) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

వివాదానికి అసలు కారణం ఇదే..

ఈ సినిమా కలెక్షన్ల పంపకాల్లో నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు మధ్య తలెత్తిన విభేదాలే ఈ వివాదానికి మూలం అని తెలుస్తోంది. సాధారణంగా మలయాళ ఇండస్ట్రీలో ఉన్న నిబంధనల ప్రకారం మొదటి వారం నిర్మాతలకు 60 శాతం వాటా వెళ్తుంది. అది రెండవ వారానికి 55 శాతం, మూడవ వారం50శాతం వాటా పంపిణీ జరుగుతుంది. అయితే, 'పేట్రియాట్' నిర్మాతలు మాత్రం మొదటి రెండు వారాల పాటు తమకు 60 శాతం వాటా కావాలని పట్టుబడుతున్నారు. దీనికి థియేటర్ల యాజమాన్యం ససేమిరా అంటోంది. రెండు వారాల పాటు 60 శాతం వాటా ఇస్తే తాము భారీగా నష్టపోతామని, ఇది ఆర్థికంగా ఏమాత్రం గిట్టుబాటు కాదని కేరళ థియేటర్ల యజమానుల సంఘం స్పష్టం చేసింది.

థియేటర్ల బాయ్‌కాట్ ..

ఈ సినిమా నిర్మాతల మొండి పట్టుదలతో కేరళలోని థియేటర్ల యజమానులు శుక్రవారం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 'పేట్రియాట్' చిత్ర ప్రదర్శన కోసం నిర్మాతలతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లకు కేరళ థియేటర్ల యజమానుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇప్పటికే నిర్మాతలు తక్కువ వాటా తీసుకుంటున్నారని, ఇప్పుడు మల్టీప్లెక్స్ తరహాలో భారీ డిమాండ్లు చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు.

►ALSO READ | Vijay Vs Sangeetha : విడాకులు ఇచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉంటా.. విజయ్‌కి సంగీత బిగ్ షాక్..!

పరిష్కారం దొరికేనా?

సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాల విషయంలో 'ఫిల్మ్ ఛాంబర్' జోక్యం చేసుకుని రాజీ కుదురుస్తుంది. అయితే, నిర్మాతలు తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ థియేటర్ల సమ్మె కొనసాగితే, అది కేవలం ఈ సినిమాపైనే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమ ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఫ్యాన్స్‌లో ఆందోళన

మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగా భారీ లెక్కలు ఉన్నాయి. కానీ, ఈ రెవెన్యూ యుద్ధం వల్ల సినిమా విడుదల ఆగిపోతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది ఇప్పుడు కేరళ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని వేచి చూస్తున్న అభిమానులకు ఈ వార్త పెద్ద షాక్ అనే చెప్పాలి. ఏప్రిల్ 23 లోపు ఈ చిక్కుముడి వీడితేనే 'పేట్రియాట్' థియేటర్లలో గర్జించగలడు. మరి నిర్మాతలు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.