టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మరోసారి లేఆఫ్స్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. వచ్చే వారం కంపెనీ భారీగా ఉద్యోగాలను లేఆఫ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం కంపెనీలోని సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాలపై తీవ్రంగా ఉండనుంది. మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 2లక్షల 20వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 2.5 శాతం కంటే తక్కువ మంది ఈ వేటుకు గురికావచ్చని తెలుస్తోంది. అంటే దాదాపు వేల సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితం కానున్నారని తెలుస్తోంది.
సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే జూలై 1 సమయంలో ఉద్యోగాల కోతను ప్రకటిస్తూ ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి లేఆఫ్స్ తీవ్రత కొంచెం తక్కువగానే ఉండనుంది. గత సంవత్సరం మే నెలలో 6వేల మందిని, ఆ తర్వాత జూలైలో మరో 9వేల మందిని కంపెనీ తొలగించింది. అయితే ప్రస్తుత లేఆఫ్స్‌లో ప్రభావితమయ్యే కొందరు ఉద్యోగులకు కంపెనీలోనే తక్షణమే ప్రత్యామ్నాయ కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని అంతర్గత వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంలో లేఆఫ్స్ ఉంటాయనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. గేమింగ్ సీఈఓ ఆశా శర్మ ఇటీవల ఉద్యోగులకు పంపిన మెమోలో.. వ్యాపారాన్ని రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొనడంతో ఈ విభాగంలో మార్పులు ఖాయమని అందరూ ఊహించారు. ఏఐ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, ఇతర రంగాలలో ఖర్చులను నియంత్రించడానికే ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
AI సాంకేతికత భవిష్యత్తులో కొన్ని సాఫ్ట్‌వేర్ సేవలను భర్తీ చేయవచ్చనే ఆందోళనల కారణంగా వాల్ స్ట్రీట్ నుండి మైక్రోసాఫ్ట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో గడిచిన నెల రోజుల్లోనే కంపెనీ షేర్లు దాదాపు 19 శాతం పడిపోయాయి. డాట్-కామ్ సంక్షోభం తర్వాత మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో ఈ స్థాయి పతనాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఈ ఆర్థిక ఒడిదొడుకులు కూడా ఉద్యోగాల కోతకు ఒక ప్రధాన కారణంగా నిలిచాయి.
ALSO READ : క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. జూలై 1 నుండి రూల్స్ మార్చేసిన HDFC, SBI
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన 'వాలంటరీ రిటైర్మెంట్ ప్రోగ్రామ్' వల్ల ఈసారి లేఆఫ్స్ భారం కొంతవరకు తగ్గింది. అమెరికాలోని లక్షా 25వేల మంది ఉద్యోగులలో దాదాపు 9వేల మంది ఈ బైఅవుట్ ఆఫర్‌కు అర్హత సాధించగా, అందులో మూడో వంతు మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు మొగ్గు చూపారు. దీనివల్ల కంపెనీ నేరుగా తొలగించాల్సిన ఉద్యోగుల శాతం గత ఏడాదితో పోలిస్తే కొంత మేర తగ్గిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
