తమిళ రాజకీయాల్లో మరో సంచలన వివాదం ముందుకు వచ్చింది. టీవీకే విజయ్ ఆధ్వర్యంలో కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయడం తమిళనాట కలకలం రేపుతోంది.
అధికార టీవీకే (తమిళ వెట్రి కజగం) పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింలపులకు ప్రలోభపెట్టిన ఆరోపణలపై బుధవారం (జులై 01) పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. యూట్యూబర్ ఐపీడీఎస్ తిరునావుక్కరసు, కరూర్ కు చెందిన ఇద్దరు డీఎంకే కార్యకర్తలతో సహా నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. టీవీకే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఆశ చూపి పార్టీ మారేందుకు ప్రోత్సహించడం వెనుక ఉన్న కీలక వ్యక్తులను అరెస్టు చేయడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కృష్ణగిరి జిల్లాలోని ఉతంగరై ఎమ్మెల్యే ఎన్. ఎలయరాజాను (టీవీకే) ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం (జూలై 1) అరెస్టులు జరిగాయని డైలీ తంతీ రిపోర్టులో పేర్కొంది.
యూట్యూబర్‌పై ఫిర్యాదు
యూట్యూబర్ ఐపీడీఎస్ తిరునావుక్కరసు, ఎలయరాజాను పార్టీ మారేలా ఒప్పించేందుకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అంగీకరించక పోవడంతో పదేపదే బెదిరించి, ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించారని పోలీసులకు అందిన ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు ఆధారంగా, చెన్నై ట్రిప్లికేన్ పోలీసులు తిరునావుక్కరసును అరెస్టు చేసి విచారిస్తున్నారు.
కరూర్ డీఎంకే కార్యకర్తలు అరెస్టు:
విచారణ సమయంలో, కరూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు టీవీకే ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపారని తిరునావుక్కరసు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై పోలీసులు కరూర్ కు హుటాహుటిన చేరుకుని, శక్తి మెస్ అనే రెస్టారెంట్ ను నడుపుతున్న డీఎంకే కార్యకర్తలు కార్తీక్, రమేష్ లను అరెస్టు చేశారు.
వీరిద్దరూ డీఎంకే నేత, మాజీ మంత్రి వి. సెంథిల్‌బాలాజీకి సన్నిహితులని తెలుస్తోంది. కరూర్‌లోని ఆయన వ్యాపార కార్యకలాపాలతో వీరికి సంబంధం ఉందని చెబుతున్నారు. కార్తీక్ డీఎంకే క్రీడా విభాగానికి డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు.
కొనసాగుతున్న రైడ్స్:
అరెస్టు అయిన ఇద్దరు డీఎంకే కార్యకర్తల నివాసాల్లో పోలీసులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు యూట్యూబర్ తిరునావుక్కరసు, నరేష్, త్యాగరాజన్, కృష్ణన్ అనే నలుగురిని అరెస్టు చేసినట్లు డైలీ తంతి పేర్కొంది.
రూ. 15 కోట్ల ఆఫర్‌పై విచారణ:
టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారని, ఒక్కో శాసనసభ్యునికి రూ. 15 కోట్లు ఆఫర్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సెంథిల్ బాలాజీకి సన్నిహితులుగా భావిస్తున్న ఇద్దరి అరెస్టులు రాజకీయంగా కలకలం రేపాయి, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
