ఇకపై లగేజ్ తక్కువైతే... టికెట్ రేటు కూడా తగ్గుతుంది! అవును, మీరు విన్నది నిజమే. లగేజ్ లేకుండా కేవలం హ్యాండ్ బ్యాగ్‌తో (క్యాబిన్ బ్యాగ్) జర్నీ చేసే వారి కోసం ఇండిగో (IndiGo) ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు కొత్తగా లైట్ (Lite) పేరుతో తక్కువ ధరకే టికెట్ ఆఫర్ తీసుకొచ్చింది.
ఈ కొత్త అఫర్ ఏంటంటే:
ఇండిగో 'లైట్' ఆఫర్.. మీరు ఎలాంటి చెక్-ఇన్ లగేజ్ లేకుండా, కేవలం 7 కేజీలలోపు ఉండే హ్యాండ్ బ్యాగ్‌తో మాత్రమే ప్రయాణిస్తే.. డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో వన్-వేకి దాదాపు రూ. 300 నుండి రూ. 400 వరకు సేవింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో కూడా ఇలాంటి డిస్కౌంట్ ఉంటాయి. పైగా ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జ్ లేకుండా ఆటోమేటిక్‌గా సీటు కూడా రిజర్వ్ అయిపోతుంది.
ఎప్పటి నుండి అంటే... ఈ జూలై 1 నుండి ఇండిగో యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వారికి ఈ 'లైట్' ఛార్జీలు అందుబాటులోకి వస్తాయి. అదికూడా జూలై 15 నుండి చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.
ఎయిర్ ఇండియాతో పోటీ!
నిజానికి గత నెల ఎయిర్ ఇండియా కూడా ఇలాంటి ఒక బేసిక్ (Basic) ఎకానమీ ఛార్జ్ అనే అఫర్ తీసుకొచ్చింది. అయితే ఎయిర్ ఇండియా తక్కువ ధర టికెట్ పై ఫ్లైట్‌లో ఇచ్చే ఉచిత భోజనాన్ని కట్ చేసింది. దీనివల్ల రూ. 300 నుండి రూ. 700 దాకా మిగులుతుంది. కానీ, ఇండిగో మాత్రం భోజనం కాకుండా.. లగేజీని బట్టి రేటు తగ్గించేలా ప్లాన్ చేసింది.
అసలు ఎందుకీ కొత్త రూల్స్?
ప్రస్తుతం ఇరాన్ ఘర్షణల వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో జెట్ ఇంధనం (విమాన ఇంధనం) ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో విమాన సంస్థలకు మెయింటెనెన్స్ ఖర్చులు భారంగా మారాయి. పైగా ఈ మధ్య కాలంలో విమాన టికెట్ల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.
అందుకే కస్టమర్లను ఆకర్షించడానికి.. "మీరు ఏ సేవలు వాడుకుంటే, వాటికే డబ్బులు కట్టండి" (Unbundling) అనే కొత్త కాన్సెప్ట్‌తో విమాన ప్రయాణాన్ని సామాన్యులకు మరింత చౌకగా మార్చడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి బ్యాగుల బరువు తగ్గించుకుంటే.. ఖర్చు తగ్గి హ్యాపీగా ప్రయాణించవచ్చన్నమాట.. భలే ఐడియా కదూ..
