నాగబంధం కథ నా కోసమే రాసినట్లుంది: విరాట్ కర్ణ

నాగబంధం కథ నా కోసమే రాసినట్లుంది: విరాట్ కర్ణ

‘‘నా ఫస్ట్ మూవీ ‘పెదకాపు’,  రెండో సినిమాగా వస్తున్న ‘నాగబంధం’.. రెండూ భారీ బడ్జెట్‌‌ సినిమాలే కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. తొలి చిత్రానికి నటుడిగా ప్రశంసలు రావడంతో దీనికి రెట్టింపు కష్టపడ్డా. స్టోరీ వినగానే ఈ కథ నా కోసమే రాసినట్టుగా అనిపించింది. వెంటనే రుద్ర, నాగసాధు పాత్రల కోసం బాడీ ట్రాన్స్‌‌ఫర్మేషన్ స్టార్ట్‌‌ చేశా. హార్స్ రైడింగ్‌‌తో పాటు డాన్స్‌‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టా. 

నాగసాధు పాత్ర మేకప్‌‌కు 6 గంటల సమయం పట్టేది. రుద్ర పాత్ర కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగా. తర్వాత నాగసాధువుగా కనిపించడానికి మరో ఐదు కిలోలు తగ్గాను. షూటింగ్ టైమ్‌‌లో జ్వరం వచ్చినా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశా. ఎందుకంటే రెండో సినిమాకే ఇలాంటి పాత్ర రావడం గొప్ప అవకాశం. 

భారీ సెట్స్‌‌, వందలమంది జూనియర్‌‌‌‌ ఆర్టిస్టుల మధ్య వర్క్ చేయడానికి మొదట్లో కొంచెం భయపడ్డా. అయితే ‘మంచి సినిమా చేస్తున్నాం... ఇవేమీ ఆలోచించకు’ అని దర్శకుడు అభిషేక్ నామా ధైర్యం చెప్పేవారు.  తీవ్రమైన చలికాలంలో శరీరంపై ఏమీ లేకుండా ఓ యాక్షన్‌‌ సీన్‌‌ చేస్తుంటే ఆ చలికి నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతా నార్మల్‌‌గానే ఉండడంతో మరుసటి రోజే షూటింగ్‌‌కు వెళ్లిపోయా.  

సినిమాలో ఏ ఒక్క యాక్షన్ సీన్‌‌కూ డూప్ ఉపయోగించలేదు. అన్నీ నేనే స్వయంగా చేశా. ఈ సినిమా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.  షూటింగ్ టైమ్‌‌లో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల ధరించా. ఇక ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ప్లాన్ చేస్తున్నా.  త్వరలో రెండు కొత్త సినిమాలను ప్రకటించబోతున్నా”.  

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం’.   కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. 
జులై 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో విరాట్ కర్ణ ఇలా ముచ్చటించాడు.