- వికారాబాద్‌లో మహిళా దొంగల ముఠా అరెస్ట్
- 8 తులాల బంగారం, 50 తులాల వెండి సీజ్
వికారాబాద్, వెలుగు: ‘నాకు బంగారం దొరికింది.. పంచుకుందామా..’ అంటూ బహిరంగ ప్రదేశాల్లో అమాయకులను లక్ష్యంగా చేసుకొని బంగారం దొంగిలిస్తున్న మహిళా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మంగళవారం తన ఆఫీస్‌లో వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన వేముల లక్ష్మి, చల్ల నర్సమ్మ, బండారి అనిత కల్లు కంపౌండ్‌లో స్నేహితులుగా ఏర్పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు.
ముగ్గురు కలిసి వికారాబాద్ జిల్లాలోని ధారూర్, పరిగి, వికారాబాద్ పట్టణంలో అమాయక మహిళలను మోసం చేసి బంగారం దొంగలించారు. వరుస దొంగతనాలు జరగడంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఆధారాలు, నేరం జరిగిన తీరును విశ్లేషించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు వికారాబాద్ జిల్లాలోనే కాకుండా నారాయణపేట జిల్లాలోని మద్దూర్, కోస్గి, నరనన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో, గతంలో సైబరాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రాచకొండ, జగిత్యాల జిల్లాల్లో సుమారు 28 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
బిస్కెట్లకు బంగారు రంగు పూసి..
రద్దీగా ఉండే మార్కెట్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రధానంగా ఒంటరిగా ఉన్న, వయసు పైబడిన అమాయక మహిళలనే వీరు టార్గెట్ చేస్తారు. నకిలీ బంగారు బిస్కెట్లు, రాడ్లు, బంగారు రంగు పూసిన రాళ్లను పడవేసి, తమకు దొరికినట్లు నటిస్తారు. “మాకు బంగారం దొరికింది, పంచుకుందాం” అని నమ్మించి బాధితులను మాటల్లో పెడుతారు.
అనంతరం నకిలీ బంగారాన్ని బాధితులకు ఇచ్చి, వారి మెడలోని అసలైన బంగారు గొలుసులు, కమ్మలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మత్తు మందు ప్రయోగించి దొంగిలిస్తారు. ఇలా ధారూర్ లో కంది లక్ష్మమ్మ నుంచి 1.8 తులాల బంగారం, వికారాబాద్ లో బాసుపల్లి సత్యమ్మ నుంచి 2 తులాల గొలుసు, పరిగిలో పోమల ఈశ్వరమ్మ నుంచి 1 తులం గొలుసు, 3 గ్రాముల కమ్మలు దొంగలించారు.
నిందితుల వద్ద నుంచి మొత్తం 8.8 తులాల బంగారం, 50 తులాల వెండి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
