ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ కు హామీలు గుర్తొస్తాయా?

ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ కు హామీలు గుర్తొస్తాయా?

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అప్పుడు హామీల వర్షం కురిపించడం టీఆర్ఎస్ కు కామన్ గా మారిందన్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీపై సీఎం కేసీఆర్‌ చేసిన ఆరోపణలను జానారెడ్డి తీవ్రంగా ఖండించారు.
నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌ పార్టీపై సీఎం కేసీఆర్‌ అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లికల్లు ఎత్తిపోతలకు తానే అనుమతులు తీసుకొచ్చినట్లు చెప్పారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రుణ మాఫీ, మూడెకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు జానా. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నందుకు అభినందిస్తున్నారని.. బంగారుతల్లి పథకాన్ని కల్యాణలక్ష్మిగా మార్చి అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపైనే కేసీఆర్‌ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ను గెలిపిస్తే.. ప్రజలను మోసం చేశారన్నారు. 2014 లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదన్నారు జానారెడ్డి.