టీఎస్పీఎస్సీ రద్దుకు రాష్ట్రపతికి లెటర్​ రాస్తా : భట్టి విక్రమార్క

టీఎస్పీఎస్సీ రద్దుకు  రాష్ట్రపతికి లెటర్​ రాస్తా :  భట్టి విక్రమార్క

హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్​ ఉద్యోగాలు అమ్ముకుంటోందని, టీఎస్పీఎస్సీ రద్దుకు రాష్ట్రపతికి లెటర్​ రాస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఉదయం కేయూలోని  స్టూడెంట్స్​తో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భట్టి మాట్లాడుతూ కేసీఆర్​ పాలన కొనసాగితే  వర్సిటీ భూములు కూడా అమ్మేస్తాడన్నారు. పీపుల్స్​ మార్చ్​ లో భాగంగా యూనివర్సిటీ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు  పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇచ్చింది లేదన్నారు. కనీసం దేవాదుల ఫేజ్​-2 పనులు సక్రమంగా చేయించినా ఫలితముండేదన్నారు. కృష్ణా నదిపై పాలమూరు- రంగారెడ్డి పంపింగ్​ స్టార్ట్​ కాలేదన్నారు. వరంగల్​లో కుర్చీ వేసుకుని అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ కట్టిస్తానని చెప్పారని, ఇంతవరకు దాని ఊసేలేదన్నారు. పేదలకు డబుల్​ బెడ్​రూంలు, జర్నలిస్టులకు ఇండ్లు కూడా రాలేదన్నారు. కేంద్ర హోం మంత్రి రాష్ట్రానికి వచ్చి మైనార్టీ రిజర్వేషన్లపై మాట్లాడితే..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్​ఇస్తానన్న సీఎం కేసీఆర్​ ఇంతవరకు నోరుమెదపలేదన్నారు. ఎంఐఎం కూడా ఎందుకు మాట్లాడటం లేదో తెలియడం లేదన్నారు. 

విభజన హామీల్లో భాగంగా కాజీపేటకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన కోచ్​ ఫ్యాక్టరీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో బీసీ జనగణన చేపట్టకుండా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బి. శోభారాణి, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్​ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​ రెడ్డి, మాజీ  మేయర్​ ఎర్రబెల్లి స్వర్ణ,  వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.