విప్రోకు రూ.2,659 కోట్ల లాభం

విప్రోకు రూ.2,659 కోట్ల లాభం

న్యూఢిల్లీ : ఐటీ సేవల కంపెనీ విప్రోకు ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన రెండో క్వార్టర్​లో నికర లాభం 9.3 శాతం తగ్గి రూ.2,659 కోట్లుగా రికార్డు అయింది. ఉద్యోగుల ఖర్చులు, అమెరికాయేతర మార్కెట్ల ఆదాయాలు తగ్గడం వంటివి ఇందుకు కారణాలని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ  నికర లాభం రూ.2,930.6 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం లాభం 3.72 శాతం పెరిగింది. గత జూన్ క్వార్టర్లో ఇది రూ.2,563.6 కోట్లుగా ఉంది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ మొత్తం ఆదాయాన్ని రూ.22,539.7 కోట్లుగా లెక్కించారు. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.19,667.4 కోట్లతో పోలిస్తే 14.60 శాతం పెరిగింది. తాజా క్వార్టర్లో ఆపరేటింగ్ మార్జిన్ 16 బేసిస్​ పాయింట్లు పెరిగి 15.1 శాతంగా ఉందని  కంపెనీ ఎక్స్చేంజ్​ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. తమ బుకింగ్‌‌‌‌‌‌‌‌లు, భారీ డీల్స్​ సంఖ్య భారీగా పెరుగుతోందని, రాబడులూ బాగున్నాయని విప్రో సీఈఓ  మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. సెప్టెంబర్​ క్వార్టర్​లో కంపెనీ 10 వేల మంది ఉద్యోగులను ప్రమోట్​ చేసింది.  జీతాల పెంపుదల, ప్రమోషన్ల ప్రభావంతో క్యూ2లో 15.1 శాతం మార్జిన్లు సాధించామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు.  ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోలు పటిష్టంగా ఉన్నాయని,  సంవత్సరానికి  నికర ఆదాయంలో 181 శాతం ఉన్నాయని వివరించారు. అంతకుముందు క్వార్టర్లో 23.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు ఈ క్వార్టర్ లో  23 శాతానికి తగ్గింది.  ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఐటీ సేవల్లో విప్రో ఉద్యోగుల సంఖ్య 2,59,179కి పెరిగింది.  పోయిన క్వార్టర్​లో కంపెనీ 15,446 మంది ఉద్యోగులను చేర్చుకుంది. వీరిలో 10 వేల మందికిపైగా ఫ్రెషర్లు ఉన్నారు. రెండో క్వార్టర్లో అమెరికాయేతర మార్కెట్లలో  ఆదాయాలు తగ్గాయని విప్రో తెలిపింది. యూరప్ నుండి వచ్చే ఆదాయం రూ. 918.6 కోట్ల నుండి రూ.787.5 కోట్లకు పడిపోయింది.  ఆసియా పసిఫిక్/మిడిల్ ఈస్ట్/ఆఫ్రికా (ఏపీఎంఈఏ)  ప్రాంతం నుంచి ఆదాయం గత ఏడాది రూ. 302.8 కోట్లతో పోలిస్తే రూ. 219.4 కోట్లకు పడిపోయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో వివరించింది. 

హెసీఎల్​కు రూ.3,489 కోట్ల లాభం 

ఐటి కంపెనీ హెచ్‌‌‌‌‌‌‌‌సిఎల్ టెక్నాలజీస్​కు ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగిసిన రెండవ క్వార్టర్లో నికరలాభం  6శాతం జంప్ చేసి రూ.3,489 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,259 కోట్ల లాభాన్ని ప్రకటించింది.  పోయిన సంవత్సరం ఇదే క్వార్టర్​లో  మొత్తం ఆదాయం రూ.20,655 కోట్లుగా రికార్డయింది. ఇది సీక్వెన్షియల్​గా 5.2శాతం పెరిగింది. ఏడాది లెక్కన 19.5శాతం పెరిగి రూ.24,686 కోట్లకు చేరుకుంది.  ఒక్కో షేరుకు రూ.10 చొప్పున ఇంటెరిమ్​ డివిడెండ్ చెల్లించాలన్న ప్రపోజల్​ను కంపెనీ బోర్డు ఆమోదించింది.  డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీ ఈ నెల 20 అని తెలిపింది. ఇదే ఏడాది నవంబరు రెండో తేదీన డబ్బు చెల్లిస్తామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.  ఈ ఐటీ కంపెనీ 2023 ఆర్థిక సంవత్సరానికి తన రెవెన్యూ గ్రోత్​ గైడెన్స్​ను  పెంచింది. ఇంతకు ముందు అంచనా వేసిన 12–-14శాతంతో పోలిస్తే నిలకడైన కరెన్సీలో హెచ్‌‌‌‌‌‌‌‌సిఎల్ టెక్ ఇప్పుడు 13.5–-14.5శాతం వృద్ధిని సాధించింది. అయితే ఇబిటా మార్జిన్ గైడెన్స్ అప్పర్ ఎండ్​ను 18-–19శాతానికి తగ్గించింది.  అంతకుముందు ఇది18-–20శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిలకడైన కరెన్సీలో సంవత్సరానికి సేవల ఆదాయం 16–-17శాతం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. తాజా క్వార్టర్లో హెచ్​సీఎల్​ 10,339 మంది ఫ్రెషర్లను చేర్చుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,19,325లకు చేరింది. అట్రిషన్ (రాజీనామాలు) రేటు 23.8శాతం వద్ద కొనసాగింది. తమ బుకింగ్‌‌‌‌‌‌‌‌లు చాలా బాగున్నాయని, కంపెనీ ఇక ముందు మరింత గ్రోత్​ సాధిస్తుందని హెచ్​సీఎల్​ టెక్  సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ అన్నారు. బీఎస్​ఈలో బుధవారం  కంపెనీ షేరు 1.5శాతం పెరిగి ఒక్కొక్కటి రూ.953 వద్ద ముగిసింది.