స్పౌజ్ సమస్య పరిష్కరించాలన్న మహిళా టీచర్లు

స్పౌజ్ సమస్య పరిష్కరించాలన్న మహిళా టీచర్లు

బాన్సువాడ, వెలుగు : స్పౌజ్ సమస్య పరిష్కరించాలని మహిళా టీచర్లు బాన్సువాడలోని స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి ఇంట్లో ఆయనకు రాఖీ కట్టి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ.. జీఓ 317 అమలులో భాగంగా భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచాలని, కానీ 19 జిల్లాల్లో భార్యాభర్తల బదిలీలకు అవకాశం ఇచ్చి మిగిలిన13 జిల్లాలను బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. ఖాళీలు ఉన్నా నిజామాబాద్ జిల్లాను బ్లాక్ లిస్టులో ఉంచారన్నారు. దీంతో తాము 7 నెలలుగా కుటుంబాలకు దూరంగా ఇల్లు , పిల్లల  బాగోగులు చూసుకోలేక, ముసలివాళ్లయిన తల్లిదండ్రులను పట్టించుకునే అవకాశం లేక నరకయాతన పడుతున్నామని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి  ఫోన్​చేసి వివరాలు కనుక్కున్నారు.

జిల్లాను బ్లాక్​లిస్ట్ నుంచి తొలగించాలని కోరారు. ఈ విషయమై సీఎంతో మాట్లాడతానని టీచర్లకు హామీ ఇచ్చారు.  కాగా, రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్​సమస్యను ఎదుర్కొంటున్న జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు, అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా మహిళా ఉపాధ్యాయులు తమను తమ కుటుంబాల వద్దకు చేర్చాలని రాఖీలు కట్టి అభ్యర్థించారు.