వానల కోసం బొడ్రాయికి జలాభిషేకం.. యాదాద్రి జిల్లా మాసాయిపేటలో మహిళలు ప్రత్యేక పూజలు

వానల కోసం బొడ్రాయికి జలాభిషేకం.. యాదాద్రి జిల్లా మాసాయిపేటలో  మహిళలు  ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట, వెలుగు: సమృద్ధిగా వర్షాలు కురవాలని యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానల కోసం బొడ్రాయికి జలాభిషేకం చేపట్టాలని గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామంలో ఒకరోజు ముందే డప్పు చాటింపు చేయించడంతో మహిళగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు. 

జల కడవలను బొడ్రాయి ఎదురుగా ఉంచి వరుణా దేవుడు కరుణించాలని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం బొడ్రాయి చుట్టూ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి, జలాభిషేకం నిర్వహించారు. అనంతరం బొడ్రాయి వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం జహంగీర్ గౌడ్, పంచాయతీ పాలకవర్గం, మహిళలు పాల్గొన్నారు.

వరుణదేవా..కరుణించరావా

ఊట్కూర్, వెలుగు: సకాలంలో వర్షాలు కురవాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలకేంద్రంలోని బీర లింగేశ్వర కాలనీలోగల బీరప్ప దేవాలయంలో ఆదివారం సప్త భజన నిర్వహించారు. వర్షాలు రాకపోవడంతో పంటల సాగు కష్టం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.