రూ.20-60 వేల లోపే ఎన్నో విదేశాలు చుట్టి రావొచ్చు

రూ.20-60 వేల లోపే ఎన్నో విదేశాలు చుట్టి రావొచ్చు

కనీసం ఒక్కసారైనా ఫారిన్ టూర్‌‌‌‌కి వెళ్లాలని అందరికీ ఉంటుంది. కానీ ‘విదేశాలకు వెళ్లడమంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. మన వల్ల కాదులే’ అనుకుంటారు చాలామంది. అందుకే ఫారిన్ టూర్‌‌‌‌ని స్కిప్ చేస్తుంటారు. కానీ విదేశాలకు వెళ్లడం అంత కష్టమేమీ కాదు. దానికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇరవై నుంచి అరవైవేల లోపే ఎన్నో విదేశాలు చుట్టి రావొచ్చు.  తక్కువ ఖర్చులో ఎన్నో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

విదేశీ టూర్ వెళ్లాలనుకునే వాళ్లు స్వయంగా  ప్లాన్ చేసుకుని వెళ్తే, ఫ్లైట్ చార్జీలు, హోటల్, ఫుడ్ ఇలా అన్ని ఖర్చులు మనమే ప్లాన్ చేసుకోవాలి. అదే టూర్ ప్యాకేజీ ఎంచుకుంటే ఖర్చులు, చార్జీలు అన్నీ అందులోనే కలిపి ఉంటాయి. అయితే ప్యాకేజీతో పోల్చుకుంటే సొంతంగా వెళ్తేనే  ఎక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే  ప్యాకేజీలు ఎక్కువగా మూడు నుంచి వారం రోజుల వరకే ఉంటాయి. అదే స్వయంగా వెళ్తే.. కావాలంటే  టూర్‌‌‌‌ని పొడిగించుకుని మరిన్ని ప్రదేశాలు చూడ్డానికి వీలుంటుంది. తక్కువ ఖర్చుతో బెస్ట్ ప్యాకేజీలు కొన్ని చూద్దాం.

సింగపూర్

మోడరన్ లైఫ్‌‌స్టైల్, అడ్వాన్స్‌‌డ్ ఆర్కిటెక్చర్ అద్భుతాలతో నిర్మించిన సింగపూర్.. బడ్జెట్‌‌లో బెస్ట్ డెస్టినేషన్. ముఖ్యంగా హనీమూన్ కు సింగపూర్ చెక్కేస్తే ఎన్నో  స్వీట్ మెమొరీస్ మూటగట్టుకోవచ్చు. సింగపూర్‌‌ రిచెస్ట్ కంట్రీస్‌‌లో ఒకటి. దేశమంతా అద్దాలతో మెరిసిపోతూ ఉంటుంది. అక్కడి రోడ్లు బిల్డింగులన్నీ నీట్‌‌గా, మోడ్రన్‌‌గా ఉంటాయి. ఆకాశాన్నంటే భవనాలు, కిటకిటలాడే షాపింగ్‌‌ మాల్స్‌‌ కనువిందు చేస్తుంటాయి.

ప్యాకేజీలు

సింగపూర్  ట్రావెల్ ప్యాకేజీని థామస్ కుక్ ట్రావెల్ సంస్థ ఒకరికి 25 వేల నుంచి 60 వేల వరకూ ప్యాకేజీలు అందిస్తుంది. ఫ్లైట్ చార్జీలు, వసతి, బ్రేక్‌‌ఫాస్ట్ ఈ ప్యాకేజీలో ఉంటాయి. యాత్రా సంస్థ సింగపూర్  ప్యాకేజీని పది వేల నుంచి పాతిక వేల వరకూ అందిస్తోంది.  ఫ్లైట్ చార్జీలు, మీల్స్, అకామిడేషన్, సైట్ సీయింగ్ అన్నీ ప్యాకేజీలో కలిపే ఉంటాయి. ఇదే ప్యాకేజీని మేక్ మై ట్రిప్ సంస్థ పాతిక నుంచి ముప్పై వేల వరకూ అందిస్తోంది. రానుపోను విమాన చార్జీలు, హోటల్ వసతి, మీల్స్ ఇందులో భాగం.

చూడాల్సినవి

అండర్‌‌ సీ వరల్డ్‌‌,  యూనివర్సల్‌‌ స్టూడియో థీమ్‌‌పార్క్‌‌, కేబుల్‌‌ కార్‌‌,  బొటానికల్‌‌ గార్డెన్‌‌, జురాగ్‌‌ పక్షుల కేంద్రం, కింగ్స్‌‌ ప్యాలెస్‌‌, నేషనల్‌‌ మాస్క్‌‌ అండ్‌‌ మ్యూజియం, జంట భవనాలు, పార్లమెంట్‌‌ హౌస్‌‌, బాటుగుహలు, లయన్‌‌ సిటీలో నైట్‌‌ సఫారీ, పడాంగ్‌‌, క్రికెట్‌‌ క్లబ్‌‌, మెరినా బే శాండ్స్ పార్క్, సిటీ హాల్‌‌, మెర్లియన్‌‌ పార్కు, థాయిన్‌‌ హాక్‌‌ కెంగ్‌‌ బుద్ధ ఆలయం, సెంటోసా ఐల్యాండ్‌‌, సింగపూర్‌‌ ఫ్లై ఓవర్లు.

థాయ్‌‌ల్యాండ్‌‌

చాలామంది ట్రావెలర్స్‌‌కు థాయిల్యాండ్ డ్రీమ్ ప్లేస్. ఇక్కడ ఉండే ఎన్నోసుందర ప్రదేశాలు సందర్శకుల మదిని దోచేస్తాయి. రకరకాల బీచులు, స్పా థెరపీలు థాయ్‌‌ల్యాండ్‌‌లోని స్పెషల్ అట్రాక్షన్స్.  థాయ్‌‌ల్యాండ్‌‌లోని బ్యాంకాక్ సిటీ జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. కేవలం షాపింగ్‌‌ కోసమే బ్యాంకాక్‌‌కు వెళ్లే వాళ్లు చాలామంది. ఇక్కడ రోజుల తరబడి షాపింగ్ చేసినా టైం  సరిపోదు.  బ్యాంకాక్  సిటీ షాపింగ్‌‌కు అంత ఫేమస్.

ప్యాకేజీలు

వారం రోజుల థాయ్ ల్యాండ్ టూర్‌‌‌‌ను థామస్ కుక్ సంస్థ 60 వేలకు ఆఫర్ చేస్తోంది.   ఫుకెట్, క్రాబి, బ్యాంకాక్ సిటీలు ఈ ప్యాకేజీలో ఉంటాయి. ఇదే ప్యాకేజీ యాత్రా సంస్థ పది నుంచి పదిహేను వేల రూపాయలకు అందిస్తోంది. ఈ ప్యాకేజీతో థాయిల్యాండ్ లోని బ్యాంకాక్, పట్టాయా నగరాలను చూసి రావచ్చు. మేక్ మై ట్రిప్ ఇదే ప్యాకేజీకి 40వేలు చార్జ్ చేస్తోంది.

చూడాల్సినవి

టైగర్‌‌ జూ, అల్కాజర్‌‌ షో, కోరల్‌‌ ఐలాండ్‌‌, నాంగ్‌‌నూచ్‌‌ గ్రామం, జెమ్స్‌‌ గ్యాలరీ, ట్రిమ్మిట్‌‌, వాట్‌‌ ఫో , వాట్‌‌ బెంచమబొపిట్‌‌, సఫారీ పార్క్‌‌, మెరైన్‌‌ పార్క్‌‌, – క్రాబి ప్రావిన్స్‌‌లోని ఫిఫి ఐల్యాండ్స్ , ఖావో సాక్ నేషనల్ పార్క్, చాతుచాక్ వీకెండ్ మార్కెట్

వియత్నాం

ఫారిన్ టూర్స్‌‌లో  వియత్నాం అన్నింటికంటే బడ్జెట్ ఫ్రెండ్లీ . ఇక్కడి కరెన్సీ మన కరెన్సీ కంటే చాలా తక్కువ. ఒక ఇండియన్ రూపీ మూడొందల వియత్నాం డాంగ్స్. అంతే కాదు వియత్నాం ఒక డిఫరెంట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడ  ప్రకృతి సౌందర్యం, సంస్కృతి ఎంతో ఆకట్టుకుంటుంది. కొండలు, లోయలు ఉండే వియత్నాంలో ఎన్నో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ విలేజ్ కల్చర్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. వారి సంప్రదాయాలు, జీవనశైలి అడుగడుగునా ఆశ్చర్యపరుస్తాయి. సముద్ర తీరాలు, గుహలు, పర్వతాలు, పంటపొలాలు ఆహ్లాదాన్నిస్తాయి.

ప్యాకేజీలు

రోజులను బట్టి వియత్నాం టూర్‌‌‌‌ను థామస్ కుక్ సంస్థ పది నుంచి యాభై వేల వరకు ఆఫర్ చేస్తోంది. హుచిమిన్, హనోయ్  సిటీలు ఈ  ప్యాకేజీలో ఉంటాయి. పదివేల ప్యాకేజిలో ఫ్లైట్ చార్జీలు ఉండవు. ముప్పై నుంచి నలభై వేల మధ్యలో ఉన్న ప్యాకేజీల్లో ఫ్లైట్ చార్జీలు కలిపి ఉంటాయి. ఇదే ప్యాకేజీ  యాత్రా సంస్థ నలభై  నుంచి యాభై వేల రూపాయలకు(ఫ్లైట్ చార్జీలతో కలిపి) అందిస్తోంది.  ఈ ప్యాకేజీతో వియత్నాంలోని హనోయ్ , హుచిమిన్ నగరాలను చూసి రావచ్చు.  మేక్ మై ట్రిప్ ఇదే ప్యాకేజీకి 40వేలు చార్జ్ చేస్తోంది.

చూడాల్సినవి:

హానోయ్‌‌ సిటీ,  హాలాంగ్‌‌ బీచ్‌‌, మేకాంగ్‌‌ డెల్టా, మ్యూనీ బీచ్‌‌, సన్‌‌డూంగ్‌‌ గుహ.

మలేసియా – బాలి

మలేసియా, ఇండోనేషియా ద్వీపాలు, అందమైన సముద్ర తీరాలతో ఉండే దేశాలు.  ఇక్కడి నేషనల్ పార్కులు, నేచురల్ బీచులు,  ప్రకృతితో అలంకరించినట్టు ఉండే  పరిసరాలు ఈ దేశాలకు ఆకట్టుకునే అందాలు.  ఈ రెండు దేశాలకు ఏడాది పొడవునా టూరిస్టులు వస్తూనే ఉంటారు. డిఫరెంట్ కల్చర్స్ కనిపిస్తాయి.  ముస్లిమ్‌‌లు, బౌద్ధులు, హిందువులు,  క్రైస్తవులు  అందరూ కనిపిస్తారు. ఇక్కడ అన్నిమతాలకు సంబంధించిన కట్టడాలు కనిపిస్తాయి. మలేసియాను ‘ట్రూలీ ఆసియా’ అని అంటారు.  మలేషియా రాజధాని కౌలాలంపూర్‌‌లో చూసేందుకు రెండు కళ్లు చాలవు.  ఇకపోతే ఇండోనేషియాలో బాలి ఒక స్వర్గధామం. తెల్లటి ఇసుక, స్వచ్ఛమైన సముద్రపు నీరు,  ఆ బీచ్ అందాలు చూస్తూ హాయిగా గడపాలంటే చూడాలంటే బాలి ఐలాండ్‌‌కు వెళ్లాల్సిందే. బాలిని ‘దేవత’ల నివాసంగా పిలుస్తారు. ఈ దీవి ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందంతో పాటు  ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో నిండి ఉంటుంది.  బాలీలో ఆలయాలు, అడవులు, బీచ్‌‌లు ఇలా ఎన్నో అందాలు ఆకట్టుకుంటాయి. బాలీ  వినోదానికి కూడా ఫేమస్.  సర్ఫీంగ్, ట్రెక్కింగ్, డైవింగ్‌‌లతో పాటు  వాటర్ స్పోర్ట్స్, క్వాడ్ బైక్ టూర్, వైట్ వాటర్ రాఫ్టింగ్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

ప్యాకేజీలు

మలేసియా, బాలి రెండూ కలిపి కొన్ని సంస్థలు ప్యాకేజీలు అందిస్తున్నాయి. మలేసియా– బాలి టూర్‌‌‌‌కు థామస్ కుక్ సంస్థ అరవై నుంచి డెబ్భై  వేల వరకు చార్జ్  చేస్తోంది. కౌలాలంపూర్, బాలి ద్వీపాలుఈ  ప్యాకేజీలో ఉంటాయి. ఈ ప్యాకేజిలో ఫ్లైట్ చార్జీలు, వసతి, మీల్స్ సైట్ సీయింగ్ ఉంటాయి. యాత్రా సంస్థ  కేవలం బాలి టూర్‌‌‌‌ని ఇరవై వేల రూపాయలకు(ఫ్లైట్ చార్జీలతో కలిపి) అందిస్తోంది.  ఈ ప్యాకేజీలో కేవలం బాలి ఐల్యాండ్ మాత్రమే చూపిస్తారు. ఫ్లైట్ చార్జీలు, మీల్స్, అకామిడేషన్ ఇందులో ఉంటాయి.

చూడాల్సినవి:

కౌలాలంపూర్‌‌, గెంటింగ్‌‌ ద్వీపం, సముద్ర తీరాలు, టియోమన్‌‌ ద్వీపం, బాతూ గుహలు, పుత్రజయ నగరం, లంకావీ ద్వీపాలు, బాలి.

కంబోడియా

కాంబోడియా అంటే ఒకప్పటి  కాంభోజ రాజ్యం. ఈ రాజ్యం ఎన్నో  కథల్లో పురాణాల్లో కూడా ఉంది. కథల్లో  చెప్పినట్టే కంబోడియా అంతా  ప్రకృతి అందాలతో  ఆకర్షిస్తుంది. కంబోడియాలోని అంకోర్‌‌ వాట్‌‌ విష్ణు ఆలయం చాలా ఫేమస్. కంబోడియా వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శించకుండా ఉండరు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా దీనికి పేరుంది. సుమారు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ  ఆలయం నీటిపై తేలుతూ ఉంటుంది. ఇవేకాకుండా… కంబోడియా అడవుల్లో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో అడ్వెంచర్ యాక్టివిటీస్‌‌కి కూడా  కంబోడియా పాపులర్.

ప్యాకేజీలు

కంబోడియా టూర్‌‌‌‌ను థ్రిల్లోపీడియా సంస్థ ముప్పై వేల వరకు చార్జ్  చేస్తోంది. కాంబోడియాలోని సైట్స్ అన్నీ  ప్యాకేజీలో ఉంటాయి. ఫ్లైట్, మీల్స్, అకామిడేషన్ కూడా  ప్యాకేజిలో భాగమే.  ఇదే ప్యాకేజీని ట్రావెల్ ట్రైయాంగిల్ సంస్థ  40 వేలకు అందిస్తోంది.

చూడాల్సినవి  
అంకోర్‌‌వాట్‌‌ ఆలయం, సీమ్‌‌రీప్‌‌, బాంటేస్రీ , సముద్ర తీరాలు,క్రాటే పట్టణం

ఈ జాగ్రత్తలు కూడా..

విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసా తప్పని సరి. పాస్ పోర్ట్‌‌ను డైరెక్ట్‌‌గా అప్లై చేసి పొందొచ్చు. వీసాను కూడా ఆన్‌‌లైన్‌‌లో మనమే అప్లై చేసుకోవచ్చు లేదా ట్రావెల్ ఆపరేటర్లు ప్యాకేజీతో పాటు ఏర్పాటు చేస్తారు.  ప్యాకేజీల్లో అకామిడేషన్ స్టాండర్డ్ హోటల్స్‌‌లో ఉంటుంది. కొన్ని సంస్థలు బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తాయి. కాబట్టి భోజనం ఖర్చులు అదనం. అలాగే ప్యాకేజీల్లో  కొన్ని ప్రదేశాలకు మాత్రమే సైట్ సీయింగ్‌‌కు  తీసుకెళ్తారు. మిగిలిన ప్రదేశాలన్నీ చూడాలంటే సెపరేట్‌‌గా ప్లాన్ చేసుకోవాలి. అక్కడి లోకల్ ట్రాన్స్‌‌పోర్ట్  చార్జీలు, భోజన ఖర్చులు సహా మొత్తం పర్యటనలో ఉండే అదనపు ఖర్చుల గురించి ట్రావెల్స్
సంస్థలను ముందే అడిగి తెలుసుకోవాలి.