చిన్నోళ్లు కొనేస్తున్నరు

చిన్నోళ్లు కొనేస్తున్నరు

కొన్ని షేర్ల​ ధరలు పడిపోతున్నా కొనుగోళ్లు.
రిస్క్​లో చిన్న ఇన్వెస్టర్లు.
చౌకగా రావడమే ప్రధాన కారణం.
ప్రమాదంలో వేలకోట్ల సంపద.
ఇలాంటివి కొనొద్దంటున్న ఎక్స్‌‌పర్ట్‌‌లు

న్యూఢిల్లీ: ఎక్కువ డబ్బు ఉన్న వారే ఎక్కువ రిస్క్‌‌ తీసుకుంటారనే వాదన మిగతా చోట్ల వర్తిస్తుందేమో గానీ దలాల్‌‌స్ట్రీట్‌‌కు మాత్రం వర్తించదు. చిన్న చిన్న/రిటైల్‌‌ ఇన్వెస్టర్లు కూడా స్టాక్‌‌ మార్కెట్‌‌లో పెద్ద సాహసాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా చాలా కంపెనీల్లో ప్రమోటర్‌‌ లేదా ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ హోల్డింగ్‌‌ విపరీతంగా తగ్గిపోతోంది. దీనివల్ల ఆయా కంపెనీల షేర్ల ధరలు 90 శాతం దాకా పడిపోయిన ఘటనలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఇలాంటి స్టాక్స్‌‌పై రిటైల్‌‌ ఇన్వెస్టర్లు మోజు పెంచుకుంటున్నారు. తక్కువ ధరలకు వస్తున్నందున ఎగబడి కొంటున్నారు. గత కొన్ని క్వార్టర్ల నుంచి ఇలాంటి పోకడ బాగా పెరిగింది. ఫలితంగా రూ.వేల కోట్ల రిటైల్‌‌ ఇన్వెస్టర్ల సంపద ప్రమాదంలో పడిపోయిందని ఎనలిస్టులు చెబుతున్నారు. వాళ్లు ఆశిస్తున్నట్టు ఇలాంటి స్టాకులు భారీగా పెరిగే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. కొన్ని స్టాకులకు డీరేటింగ్‌‌ ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు.

స్టడీలు ఏం చెబుతున్నాయ్‌‌ ?

ప్రమోటర్‌‌ లేదా ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ షేర్‌‌ హోల్డింగ్‌‌ తగ్గి రిస్కులో ఉన్న 228 స్టాక్స్‌‌లో ఎనిమిది మాత్రమే 75 శాతం కంటే ఎక్కువగా కోలుకున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ స్టడీ తేల్చింది. అంటే ఇవి గతంలోని గరిష్టస్థాయిలకు చేరుకున్నాయన్న మాట! ‘‘స్టాక్‌‌ ధర తక్కువ ఉందని కొనడం సరైంది కాదు. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. గతంలో బాగా పెరిగి షేర్‌‌హోల్డింగ్‌‌ ఇబ్బందుల వల్ల తగ్గిన షేర్లను విపరీతంగా కొంటున్నారు. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, యెస్‌‌ బ్యాంక్‌‌లో పాలనాపరమైన, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి కంపెనీల స్టాక్స్‌‌తో లాభాలు సంపాదించడం చాలా కష్టం. ధైర్యం చేసి కొన్నా నష్టాలు తప్పవు. వీటికి దూరంగా ఉండటమే మేలు. ’’ అని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌కు చెందిన దీపెన్‌‌ సేఠ్‌‌ అన్నారు.

కొన్ని ఉదాహరణలు..

-జైప్రకాశ్‌‌ అసోసియేట్స్‌‌ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 73 శాతం పడిపోయింది. అయితే సెప్టెంబరు క్వార్టర్‌‌ ఆఖరు వరకు ఇందులో రిటైల్‌‌ ఇన్వెస్టర్ల వాటా 32.6 శాతానికి చేరింది.

-సుజ్లాన్‌‌ ఎనర్జీలో ఇదే కాలంలో షేరు ధరలు 54 శాతం నష్టపోగా, ఇన్వెస్టర్ల వాటా మాత్రం 30.5 శాతానికి పెరిగింది.

-రిలయన్స్‌‌ క్యాపిటల్‌‌లో సెప్టెంబరు క్వార్టర్‌‌ ముగిసే నాటికి రిటైల్‌‌ ఇన్వెస్టర్ల వాటా 27 శాతానికి చేరింది. 2004 తరువాత ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. ఇదే సంవత్సరంలో ఇప్పటి వరకు దీని షేరు ధర ఏకంగా 94 శాతం పడిపోయింది.

-యెస్‌‌ బ్యాంకులోనూ ప్రమోటర్‌‌ వాటా అమ్ముకోవడంతో షేరు ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 77 శాతం క్షీణించింది. ఇదేకాలంలో రిటైల్‌‌ హోల్డింగ్‌‌ 8.5 శాతం నుంచి 27.4 శాతానికి చేరింది.

-డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌‌కు రూ.242 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. షేర్‌‌హోల్డింగ్‌‌ డేటాను మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే జూన్‌‌ క్వార్టర్‌‌ ముగిసే నాటికి ఇందులో రిటైల్‌‌ ఇన్వెస్టర్ల వాటా 28.3 శాతంగా నమోదయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ షేరు విలువ 92 శాతం తగ్గిపోయింది.

-రిలయన్స్‌‌ కమ్యూనికేషన్‌‌లో జూన్‌‌ క్వార్టర్‌‌ నాటికి రిటైల్‌‌ ఇన్వెస్టర్ల షేర్ల మొత్తం 30.9 శాతానికి చేరుకుంది. ఈ కంపెనీ షేర్‌‌హోల్డింగ్‌‌ విధానాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ క్యాలెండర్‌‌ సంవత్సరంలో దీని షేరు విలువ 94 శాతం పడిపోయింది.