మానవత్వం చాటిన యువకులు… కరోనా మృతుడికి అంత్యక్రియలు

మానవత్వం చాటిన యువకులు… కరోనా మృతుడికి అంత్యక్రియలు

కామారెడ్డి, వెలుగు: క‌రోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా అత‌ని ఇత‌ర‌ కుటుంబ స‌భ్యులు, బంధువులు ఎవ‌రూ ముందుకు రాకపొవటంతో కాలనీకి చెందిన యువకులు అత‌ని అంత్యక్రియలు జ‌రిపించిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ టౌన్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ లోని ఎన్జీవోస్ కాలనీలో నివసించే రిటైర్డ్ ఎంప్లాయ్ (60)కి ఇటీవల కరోనా వచ్చింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆ వ్య‌క్తి శనివారం ఉదయం మరణించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మున్సిపల్ సిబ్బంది, ఇతర కుటుంబ స‌భ్యులు, ‌ బంధువులు ఎవ‌రూ రాలేదు. మృతునికి భార్య, 14 ఏళ్ల కొడుకుఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువకులు యహియా, గౌస్, ఫహద్, కబీర్లు ముందుకొచ్చి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పీపీఈ కిట్లు ధరించిన యువకులు శవాన్ని ఇంట్లో నుంచి బటయకు తీసుకొచ్చి ,అంబులెన్స్ ద్వారా శ్మశాన వాటికకు తరలించారు. కొడుకు చేత అంత్యక్రియలు పూర్తి చేయించారు. అపద కాలంలో అయిన వాళ్లంతా దూరం కాగా కష్టకాలంలో అండగా నిలిచిన యువకులను స్థానికులు అభినందించారు.