తెలంగాణలో కరెంట్ ​కోతల్లేవ్..నిరంతరాయంగా విద్యుత్‌‌ సరఫరా చేస్తున్నాం : భట్టి విక్రమార్క

తెలంగాణలో కరెంట్ ​కోతల్లేవ్..నిరంతరాయంగా విద్యుత్‌‌ సరఫరా చేస్తున్నాం : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని, నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరెంట్ కోతల పేరుతో బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు మొత్తం 36,207 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరగగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ 30 వరకు 38,155 మిలియన్ యూనిట్ల కరెంట్‌‌‌‌ను సరఫరా చేశామని తెలిపారు. ఒకే రోజు గరిష్టంగా 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ విద్యుత్‌‌‌‌ను సరఫరా చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. 

ఇంతకంటే ఏం ఆధారం కావాలి?

‘‘గతేడాది ఏప్రిల్ 24 నుంచి 30 వరకు రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ టైమ్‌‌‌‌లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,369 సార్లు 11 కేవీ లైన్ ట్రిప్‌‌‌‌ అయ్యాయి. 580 గంటలు విద్యుత్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం తమ ప్రభుత్వంలో ఇదే టైమ్‌‌‌‌లో కేవలం 272 చోట్ల 11 కేవీ విద్యుత్‌‌‌‌ సరఫరా ట్రిప్‌‌‌‌ అయింది. 89 గంటలు మాత్రమే కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది”అని భట్టి వెల్లడించారు.