పాడైన షూ కోసం ల్యాండ్రీ షాప్ నడుపుతోంది

పాడైన షూ కోసం ల్యాండ్రీ షాప్ నడుపుతోంది

మహిళల జీవితంలో పెండ్లి ఒక్కటే భాగం కాదు. జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉంటుంది వాళ్లకు. కానీ, ఎదురయ్యే సవాళ్ల వల్ల వాటిని వదిలేసేవాళ్లు కొందరైతే, పట్టుబట్టి వాళ్లకు కావాల్సింది చేసేవాళ్లు ఇంకొందరు. అలాంటి ఇబ్బందులుపడి ‘షూ లాండ్రీ షాప్‌’ పెట్టి, చివరికి తను అనుకున్నది చేసి దాంట్లో సక్సెస్‌ అయిన షాజియా ఖైసర్‌ గురించి‌...

షాజియాది బీహార్‌‌లోని భాగల్‌పూర్‌‌ అనే గ్రామం. చిన్నప్పటినుంచే స్వేచ్ఛగా బతకాలి. ఏదైనా సాధించాలి. అందరికీ తన పేరు తెలిసేలా చేయాలని కలలు కనేది. షాజియా సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టింది. అందరి పిల్లల్లానే బడికి పంపించి చదివించాడు తండ్రి. కానీ, చుట్టాలు, మత పెద్దలు చెప్పిన మాటలు విని ఇంటర్ చదువుతున్న షాజియాకు చదువు మానిపించి పెండ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. అందుకు షాజియా ఒప్పుకోలేదు. తను కోరుకున్న జీవితానికి మధ్యలోనే అడ్డుపడుతున్న వాళ్లందరితో గొడవ పడింది. తను ఎలా బతకాలనుకుంటోందో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పింది. ఎలాగోలా తల్లిదండ్రులను ఒప్పించి, పెండ్లి వాయిదా వేయించింది.

కొత్తగా ప్రయత్నించాలని

పై చదువులకోసం అమెరికా వెళ్లి, ఫిజియోథెరపీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఇండియాకి తిరిగి రాగానే ‘జాబ్‌ చేస్తాన’ని చెప్పినా వినకుండా పెండ్లి చేశారు తల్లిదండ్రులు. పెండ్లైన కొన్ని రోజులకి భర్తను ఒప్పించి స్కూల్‌లో టీచర్‌‌గా పని చేసింది. ఆ జాబ్‌ తృప్తి నియ్యలేదు. తరువాత యునిసెఫ్‌లో, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌లో మంచి జీతానికి ఉద్యోగం వచ్చినా చేరలేదు. ‘ఇవి కాకుండా వేరే ఏదన్నా చేయాల’నుకునేది. అప్పుడే తనకు ‘షూ లాండ్రీ’ బిజినెస్‌ ఐడియా వచ్చింది. ఈ ఐడియాకు భర్త సపోర్ట్‌ దొరికింది. మన దేశంలో చాలామంది బ్రాండెడ్​ షూ కొంటుంటారు. అవి కాస్త చినిగినా, మరకలు పడినా పక్కన పెడతారు. వాటిని బాగు చేయడానికి ఎవరూ లేరని పారేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఉపయోగపడేలా 2016లో ‘రివైవల్‌’ లాండ్రీ షాపు తీసుకొచ్చింది.

ఇందులో చిరిగిన షూలు కుడతారు. మరకలంటిన వాటిని డ్రై క్లీనింగ్‌ చేసి కొత్తవాటిలా చేస్తారు. దీనికోసం నోయిడా, చెన్నైకి వెళ్లి ఫుట్‌వేర్‌‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి వర్క్‌ ఎలా చేయాలో నేర్చుకుంది. మొదట ముగ్గురితో మొదలైంది రివైవల్‌. ఇప్పుడు పదిహేను మందితో మూడు స్టోర్స్‌ అయ్యాయి. ఇక్కడ షూస్‌తో పాటు చెప్పులు, లెదర్‌‌ బ్యాగ్‌లు, జాకెట్‌లు, కార్పెట్లు, చెయిర్లను కూడా బాగు చేస్తారు. ఫ్రీ పికప్‌, డెలివరీ సర్వీస్‌ని కూడా మొదలుపెట్టారు. 

డొనేషన్స్ ఇస్తూ.. 

రివైవల్‌ గురించి తెలిసిన చాలామంది వాళ్ల షూ బాగుచేయించుకోవడానికి వచ్చేవాళ్లు. అయితే కొంతమంది తిరిగి తీసుకునేవాళ్లు కాదు. అలా మిగిలిపోయిన షూలను ఏం చేయాలని ఆలోచిస్తున్నపుడు, ఎండలో చెప్పులు లేకుండా రిక్షా తొక్కుతూ వెళ్తున్న ఒక పెద్దాయన్ని చూసింది షాజియా. అతన్ని పిలిచి షాప్‌లో చాలాకాలంగా మిగిలిపోయి ఉన్న షూలను ఇచ్చింది. అవి వేసుకుని తెగ మురిసిపోయాడతను. అప్పుడే ‘మన చుట్టు పక్కల కనీసం చెప్పులు కొనడానికి డబ్బు లేని వాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకోసం ఏదైనా చేయాల’నుకుంది. అప్పటినుంచి ‘ఫుట్‌ వేర్ డొనేషన్‌ క్యాంప్‌’ పెట్టి షాప్‌లో మిగిలిన షూస్‌ను పేదవాళ్లకు ఇచ్చేయడం మొదలుపెట్టింది. రోడ్డు మీద పారేసిన చెప్పులు, షూస్‌ను ఏరుకొచ్చి బాగు చేసేది. ఇదంతా చేస్తున్న షాజియా ‘బెస్ట్‌ స్టార్టప్‌ అవార్డ్‌’ గెలుచుకుంది. ‘బీహార్ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌’ ఆమెను సన్మానించింది.

‘ఈ బిజినెస్‌ మొదలుపెట్టే ముందు ‘ఇంత చదువు చదివి చెప్పులు కుడతావా?’అని తిట్టేవాళ్లు చాలామంది. ఇది నేను చేసే పని. నా ఇష్టమున్నది చేస్తా. నేను చేసే పనిపైన నా  భర్త నమ్మకం ఉంచాడు. అది చాలు నాకు. వేరే వాళ్లేమనుకున్నా నాకు అనవసరం. అయినా, ఒకరు ఏ పని చేయాలో ఇంకొకరు ఎలా నిర్ణయిస్తారు? ఆ హక్కు వాళ్లకు లేదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి.  మీకు నచ్చిన పని చేస్తే లైఫ్‌లో సక్సెస్ అవుతార’ని అంటోంది షాజియా.