CSK vs RCB: నో బాల్ వివాదం.. అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ

CSK vs RCB: నో బాల్ వివాదం.. అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ

ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అద్భుతం చేసిందనే చెప్పాలి. లీగ్‌లో ప్రథమార్ధంలో వరుస ఓటములతో కూనరిల్లిన ఆర్‌సీబీ.. ద్వితీయార్థంలో సంచలన ప్రదర్శన కనపరిచింది. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయాన్ని అందుకుంటే.. అనంతరం వరుసగా 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 

శనివారం తమ సొంత ఇలాఖాలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు రెండు విభాగాల్లోనూ రాణించింది. మొదట బ్యాటర్లు కోహ్లి(47), డు ప్లెసిస్ (54), రజత్ పటిదార్(41), గ్రీన్(38 నాటౌట్) రాణించగా.. బౌలర్లను వారికి సహకరించారు. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్‌ను మట్టికరిపించి ఔరా అనిపించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‪సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగడం వివాదాస్పదం అవుతోంది.   

చెన్నై ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో కోహ్లీ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. వర్షం కారణంగా బంతి స్లిప్ అవుతూ వచ్చింది. దీంతో ఫెర్గ్యూసన్ వేసిన 12వ ఓవర్ రెండో బంతి నో బాల్‌గా పడింది. ఫ్రీ హిట్ లభించడంతో ఆ బంతిని రచిన్ రవీంద్ర బౌండరీకి తరలించాడు. దాంతో చెన్నై జట్టుకు బాల్ కౌంట్ లేకుండానే 5 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన బాల్ కూడా స్లిప్ అవుతూ ఫుల్ టాస్ పడింది. తడి కారణంగా బాల్ పదే పదే స్లిప్ కావడంతో బంతిని మార్చాల్సిందిగా ఫెర్గ్యూసన్, డుప్లెసిస్.. అంపైర్‌తో కోరారు. కానీ, అందుకు అంపైర్ నిరాకరించాడు. వెంటనే ఆ వివాదంలోకి కోహ్లీ ఎంటర్ అయ్యాడు. బంతిని మార్చమంటూ  ఆవేశంగా అంపైర్‌పై ఫైర్ అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.