ఇంజనీరింగ్ క్రేజ్ తగ్గుతోంది..

ఇంజనీరింగ్ క్రేజ్ తగ్గుతోంది..
  • బీఫార్మసీ, నర్సింగ్​ కోర్సులకు డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఒకప్పుడు ఇంజనీరింగ్​ ఓ వెలుగు వెలిగింది. కానీ, ఇప్పుడు దాని క్రేజ్ రోజురోజుకూ తగ్గుతోంది. సీట్లు భారీగా మిగిలిపోయి, కాలేజీలు మూతపడ్డాయి. మార్కెట్​అవసరాలకు తగ్గట్టు కోర్సులు లేకపోవడం, ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి పెద్దగా కొలువులు దొరక్కపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యావేత్తలు చెబుతున్నారు. అయితే మరోపక్క ఫార్మసీ, నర్సింగ్​లాంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. రెగ్యులర్ సాంప్రదాయ కోర్సులకు పెద్దగా ఆదరణ తగ్గడం లేదు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసిన లెక్కల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 
ఐదేండ్లలో 5 లక్షల అడ్మిషన్లు తగ్గినయ్.. 
దేశవ్యాప్తంగా దాదాపు అని రాష్ర్టాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఏటా తగ్గుతున్నాయి. దేశంలో 2015–16 అకడమిక్ ఇయర్​లో 42,03,933 మంది బీటెక్​చదివితే, 2019–20 అకడమిక్ ఇయర్​లో ఆ సంఖ్య 36,44,045కు తగ్గింది. అంటే కేవలం ఐదేండ్లలోనే 5.59 లక్షల అడ్మిషన్లు తగ్గాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. 2016–17లో 73,686 మంది చేరితే, 2019–20లో ఆ సంఖ్య 65 వేలకు తగ్గింది. ఏటా 30 వేల వరకూ సీట్లు మిగిలిపోతున్నాయి. కాలేజీలూ భారీగా మూతపడ్డాయి. నచ్చిన కాలేజీ, కోర్సులో అడ్మిషన్  దొరక్కపోవడంతోనూ స్టూడెంట్లు బీటెక్​లో చేరడం లేదు. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది చదువుతున్న కోర్సు బీటెక్​కావడం గమనార్హం. నిరుడు 9,503 మంది ఫారిన్ స్టూడెంట్లు బీటెక్​చదివారు. 
ఫార్మసీ, నర్సింగ్​కు డిమాండ్...
గత కొంతకాలంగా నర్సింగ్, బీఫార్మసీ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. 2015–16లో బీఫార్మసీలో 1,95,178 మంది చేరితే, 2019–20 నాటికి 2,93,822 మందికి పెరిగింది. ఐదేండ్లలో దాదాపు లక్ష అడ్మిషన్లు పెరిగాయి. 2015–16లో 1,91,612 మంది బీఎస్సీ నర్సింగ్ చదివితే, 2019–20 నాటికి ఆ సంఖ్య 2,89,280 మందికి పెరిగింది. ఐదేండ్లలో 97,668 అడ్మిషన్లు పెరిగాయి. వీటితో పాటు పారామెడికల్ కోర్సుల్లోనూ భారీగా అడ్మిషన్లు పెరుగుతున్నాయి.  
సంప్రదాయ కోర్సులకు  అదే ఆదరణ 
దేశంలో డిగ్రీ సంప్రదాయ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులకు ఆదరణ కొనసాగుతోంది. 2015–16లో 1.76 కోట్ల మంది ఆయా కోర్సుల్లో చేరితే, 2019–20లో 1.82 కోట్ల మంది చేరారు. బీఏలో స్వల్పంగా అడ్మిషన్లు తగ్గినా, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో మాత్రం అడ్మిషన్లు పెరిగాయి. దేఈశంలో ఎక్కువ మంది చదువుతున్న కోర్సు బీఏ కావడం గమనార్హం. 2019–20లో బీఏలో 94.87 లక్షల మంది చదువుతుండగా, బీఎస్సీ 50.92 లక్షల మంది, బీకాం 36.66 లక్షల మంది చదువుతున్నారు.