రిజర్వేషన్లను టచ్​ చెయ్యనివ్వను

రిజర్వేషన్లను టచ్​ చెయ్యనివ్వను
  • కాంగ్రెస్ పార్టీకి తేల్చిచెప్పిన ప్రధాని మోదీ
  • మతం చూసి రిజర్వేషన్ ఇవ్వబోమని రాసిస్తరా?
  • ఇండియా కూటమికి సవాల్ విసిరిన మోదీ

బనస్కాంత (గుజరాత్) : మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలను కట్టబెట్టాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కోటాను సవరించి మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం తథ్యమని చెప్పారు. ఈమేరకు బుధవారం గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.

అయితే, బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను కదిలించడం ఎవరి వల్లా కాదని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని, విద్య, ఉద్యోగాలలో రాజ్యాంగం వారికి కల్పించిన రిజర్వేషన్ పొందేందుకు సాయపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్​ గాంధీకి మోదీ సవాల్​ విసిరారు. ‘తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను దుర్వినియోగం చేయబోమని, రిజర్వేషన్లకు మతాన్ని ఆధారంగా పరిగణించబోమని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి లిఖిత పూర్వకంగా రాసివ్వాలి.

అలా రాసిచ్చే ధైర్యం ఉందా’ అంటూ ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు నోటిమాటగా ఇచ్చే హామీలను కానీ, ఆ పార్టీని కానీ నమ్మలేమని మోదీ చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు జనరల్ కేటగిరీలో పేదలకు కల్పించిన రిజర్వేషన్ల జోలికి వెళ్లబోమని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తాను ప్రాణాలతో ఉన్నంతకాలం రాజ్యాంగం పేరు చెప్పి రిజర్వేషన్లతో కాంగ్రెస్ ఆడుకునే ఛాన్స్ ఇవ్వబోనని, ఈ విషయం కాంగ్రెస్ సహా విపక్ష నేతలంతా తెలుసుకోవాలని మోదీ హితవు పలికారు.

బీజేపీపై తప్పుడు ప్రచారం..

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా ఇవ్వాలంటూ బీజేపీ చేస్తున్న విజ్ఞప్తిపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మోదీ మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశంతోనే మోదీ 400 సీట్లలో ఎన్డీయేను గెలిపించాలని అడుగుతున్నాడంటూ  అబద్ధాలు చెబుతోందన్నారు. అయితే, ఇప్పుడున్న ఎన్డీయే కూటమికి ఉభయసభలలో 360 మంది ఎంపీలు ఉన్నారని, వైసీపీ, బీజేడీ ఎంపీలను కూడా కలిపితే మొత్తం 400 సంఖ్య దాటుతుందని మోదీ గుర్తుచేశారు.