- వంట గ్యాస్ మంట.. ఎల్ పీజీ ధర రూ.60 పెంపు
- ఉజ్వల్ సిలిండర్ధర కూడా పైకి
- కమర్షియల్ ఎల్ పీజీ ధర రూ.114 జంప్
న్యూఢిల్లీ: ఇండ్లలో వంట కోసం వాడే డొమెస్టిక్ ఎల్‌పీజీ 14 కిలోల సిలిండర్ ధరను రూ.60 పెంచుతున్నట్టు కేంద్ర ఆయిల్ మార్కెట్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.
గడిచిన 11 నెలల్లో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. గత ఏప్రిల్‌లోనూ ధరలను పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913 కు చేరింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. వీరికి వచ్చే రూ.300 సబ్సిడీ పోగా సిలిండర్ ధర రూ.613 గా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ రంగ చమురు సంస్థల వద్ద ఉన్న ఆర్థిక వెసులుబాటుతో ఆ భారాన్ని అవే భరించనున్నాయి. వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా రూ.114.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.1,883 కు చేరింది. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.302 పెరిగింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్ నుంచి చమురు రవాణా జరిగే హోర్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90 శాతం ఈ మార్గం నుంచే వస్తోంది. ఈ పెంపు వల్ల సామాన్యులపై రోజుకు కేవలం 20 పైసల భారమే పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకతో పోలిస్తే భారత్‌లోనే గ్యాస్ ధర తక్కువగా ఉందని తెలిపింది.
మూడేళ్ల గరిష్టానికి ధరలు
గత వారం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ) ధర 10 డాలర్లు ఉండగా, యుద్ధం వల్ల ఇప్పుడు అది 25.40 డాలర్లకు చేరింది. కేవలం వారం రోజుల్లోనే ధర రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది.
ఖతర్ నుంచి ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. సరఫరా నిలిచిపోవడం వల్ల దేశీయంగా గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రభుత్వం అత్యవసర అధికారాలను ఉపయోగించి రిఫైనరీలలో ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. మనదేశంలో గతేడాది 31 మిలియన్ టన్నుల ఎల్పీజీని వాడింది. ఇందులో 12 మిలియన్ టన్నులు మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయింది. మిగతాది దిగుమతుల ద్వారా సరఫరా అయింది.
చుక్కల్లో క్రూడ్ ధరలు
గత నెల 28 నుంచి మొదలైన యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. అమెరికా ముడి చమురు ధరలు ఒకే వారంలో 35.63 శాతం పెరగడం ఇదే మొదటిసారి. వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ ధర బ్యారెల్ కు 90.90 డాలర్ల వద్ద ముగిసింది. బ్రెంట్ చమురు ధర కూడా దాదాపు 28 శాతం పెరిగి 92.69 డాలర్లకు చేరింది.
2020 ఏప్రిల్ తర్వాత ఒకే వారంలో ఇంతటి పెరుగుదల ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ రంగాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల అవి ధరలను పెంచే అవకాశాలు ఉంటాయి.
