హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బస్టాండ్లలో తల్లులు తమ చంటి పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. చుట్టూ వందలాది మంది మధ్య తమ బిడ్డలకు పాలు ఎలా ఇవ్వాలో తెలియక తల్లులు సతమతమవుతుంటారు.
ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో టీజీఎస్ఆర్టీసీ సహకారంతో రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క వీటిని బంజారా భవన్నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ఎంజీబీఎస్ లాంటి రద్దీగా ఉండే 7 మేజర్ బస్టాండ్లలో వీటిని అందుబాటులోకి తెస్తారు. కేవలం బస్టాండ్లలోనే కాకుండా భవిష్యత్లో జనం ఎక్కువగా వచ్చే దేవాలయాలు, టూరిస్ట్ ప్లేస్ల్లోనూ ఈ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
బస్టాండ్లలో స్పెషల్ రూం..
రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లు అయిన ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రేతి బౌలీ, ఉప్పల్ బస్టాండ్, మల్కాజ్గిరి రైల్వేస్టేషన్సమీపంలోని బస్టాండ్, మేడ్చల్, కాచిగూడ బస్టాండ్స్ తోపాటు జిల్లాల్లోని పెద్ద బస్టాండ్లలో ఈ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. బస్టాండ్లలో సపరేట్ గా అన్ని సౌకర్యాలతో ఒక గదిని కేటాయిస్తున్నారు. ఈ గదిలో కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.
తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చేలా కంఫర్టబుల్ సోఫాలు, చైర్లు ఉంటాయి. బిడ్డల బట్టలు, బ్యాగులు పెట్టుకోవడానికి ఒక టేబుల్, ప్రైవసీ ఉండేలా కర్టెన్లు ఏర్పాటు చేస్తున్నారు. గాలి కోసం ఫ్యాన్, లైటింగ్, చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్ సౌకర్యం కల్పిస్తారు. సరిపోనూ స్థలం ఉన్న బస్టాండ్లలో అటాచ్ వాష్ రూం కూడా ఏర్పాటు చేయనున్నారు. డైపర్లు పడేయడానికి డస్ట్ బిన్లు కూడా ఉంటాయి. తల్లి ప్రశాంతంగా బిడ్డకు పాలు పట్టేలా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు.
మేడారంలో సక్సెస్..
ఇటీవల జరిగిన మేడారం జాతరలో తల్లుల కోసం ప్రత్యేకంగా 13 బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ వీటికి మంచి స్పందన వచ్చింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లలోనూ ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు డిసైడ్ అయ్యారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి స్థలాన్ని కేటాయించారు. అయితే, వీటి మెయింటెనెన్స్ ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా చర్చ నడుస్తోంది.
ఆర్టీసీ సిబ్బందే చూసుకోవాలా? లేక స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలా? అనే దానిపై ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. మొత్తానికి పబ్లిక్ ప్లేసెస్ లో తల్లుల ఇబ్బందులను గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
