గణపతి ఎక్కడ?.. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోతారనే ప్రచారం 

గణపతి ఎక్కడ?.. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోతారనే ప్రచారం 
  • తాజాగా సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సమక్షంలో సరెండర్​అవుతారంటూ వార్తలు 
  • అలాంటిదేమీ లేకపోవడంతో గణపతి ఏమయ్యారని సర్వత్రా చర్చ 

హైదరాబాద్, వెలుగు: మోస్ట్​ వాంటెడ్​ మావోయిస్ట్​ లీడర్ ​ముప్పాళ్ల లక్ష్మణ్‌‌‌‌రావు అలియాస్ గణపతి జాడేది? మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరి న తరుణంలో ప్రస్తుతం ఆయన ఎక్కడ, ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్నది. మావోయిస్టు ఉద్యమంలో గణపతితో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన  లీడర్లు దేవ్​జీ, సంగ్రామ్​, సోనూ, ఆశన్న, దామోదర్‌‌‌‌‌‌‌‌లాంటి వారంతా  పోలీసులకు లొంగిపోయారు.  

పోలీసులను ధిక్కరించి ఉద్యమంలోనే కొనసాగుతామని భావించిన నంబాల కేశవరావు, హిడ్మాలాంటి లీడర్లు ఎదురుకాల్పుల్లో మరణించారు.  కానీ ఉద్యమంలో వీరందరికీ మార్గదర్శకుడైన గణపతి జాడలేరు.  మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్న ఆయనను తెలంగాణ పోలీసులు నేపాల్‌‌‌‌లో అదుపులోకి తీసుకున్నారని, ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సమక్షంలో లొంగిపోతారనే వార్తలు వచ్చాయి.

ఆరోజు అలాంటిదేమీ లేకపోవడంతో  సీఎం రేవంత్ దగ్గర​ సరెండర్​అవుతారనే ప్రచారం జరిగింది.  కానీ శనివారం లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో గణపతి లేరు. దీంతో  ఆయన అసలు బతికే ఉన్నారా? బతికి ఉంటే ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా గణపతి లొంగిపోతే ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగనీయమని సీఎం రేవంత్​ ప్రకటించారు. అటు గణపతికి ఆరోగ్యం సహకరించడం లేదంటూ  పోలీస్​ బాస్​ శివధర్​ రెడ్డి కూడా చెప్పారు.   

 ఇంకా చర్చల దశలోనే?

మావోయిస్టుల సరెండర్​ సందర్భంగా శనివారం సీఎం రేవంత్‌‌‌‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల లొంగిపోయిన దేవ్​జీ బృందం తమ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిందని, తమ పరిధిలో ఉన్నవాటిపై తాము హామీ ఇచ్చామని, కేంద్రం పరిధిలోని అంశాలను హోంమంత్రి అమిత్​షాతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. సీజ్​ఫైర్​ పాటించాలని, గణపతిసహా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్యాకేజీ పెంచడం సహా వివిధ ప్రజాసమస్యలను పరిష్కరించాలనేవి ముఖ్యమైన ప్రతిపాదనలుగా చెప్తున్నారు.

 వీటిపై అమిత్​షా నుంచి హామీ వచ్చిందా? లేదా? తెలియడం లేదు.  అజ్ఞాతంలో ఉన్న గణపతి, ఇతర మావోయిస్టు నేతలతో చర్చలు జరుగుతున్నాయని, ‘ఆపరేషన్​ కగార్’​ గడువు మార్చి 30 లోగా ముగుస్తున్నందున ఆలోపు లొంగిపోయే అవకాశముందనే వాదనలూ వినిపిస్తున్నాయి. కాగా, 2018లో అనారోగ్య కారణాలతో పార్టీ చీఫ్​ బాధ్యతల నుంచి  గణపతి తప్పుకోవడంతో  నంబాల కేశవరావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ ఎన్నుకుంది. ఆ తర్వాత గణపతి  సెంట్రల్​కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతూ పార్టీకి తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు.

2024 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్​ కగార్’​ పేరిట మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో  ఆయన బిహార్‌‌‌‌‌‌‌‌లోని ఓ సేఫ్​ జోన్‌‌‌‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. 2024 జులై వరకు గణపతి అబూజ్‌‌‌‌మఢ్‌‌‌‌​ అడవుల్లోనే ఉంటూ పొలిట్​బ్యూరో, సెంట్రల్​ కమిటీ మీటింగ్‌‌‌‌లలో పాల్గొన్నారనే  కీలకమైన సమాచారాన్ని ఎస్ఐబీ సేకరించింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ దొరకట్లేదని పోలీసులు చెబుతున్నారు. గణపతి కొడుకు శ్రీనివాస్​పేరుతో ఇటీవల ‘నాన్నా లొంగిపో’ అంటూ రిలీజ్​ చేసిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్ అయింది. కానీ అది నిజమేనా? కల్పితమా? అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.  గణపతి లొంగుబాటుకు సంబంధించి రాబోయే మూడు వారాలే కీలకమనే చర్చ జరుగుతున్నది.