హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు.. ఒప్పుకోకుంటే..

హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు.. ఒప్పుకోకుంటే..
  • రాబోయే ఆరు నెలల్లో హైదరాబాద్​ సిటీకి  2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
  • డీజిల్​ బస్సులను జిల్లాలకు తరలించాలని నిర్ణయం
  • ఈవీ బస్సు డ్రైవర్లుగా ఒలెక్ట్రా సంస్థ ఉద్యోగులే 
  • సర్​ప్లస్​ డ్రైవర్లకు, మెకానిక్​లకు కండక్టర్లుగా చాన్స్
  • ఒప్పుకోకుంటే జిల్లాలకు ట్రాన్స్​ఫర్​ చేసే యోచన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీని  కాలుష్యరహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడ్తున్న సంస్థ.. ఇక్కడ నడుస్తున్న డీజిల్​బస్సులను జిల్లాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సిటీలో పనిచేస్తున్న డ్రైవర్లు, మెకానిక్​లను ఇతర జిల్లాలకు ట్రాన్స్​ఫర్​చేయడం కంటే ఇక్కడే ఈవీ బస్సుల్లో  కండక్టర్లుగా నియమించాలని భావిస్తోంది. రాబోయే ఆరు నెలల్లో  కేంద్రం నుంచి రాష్ట్రానికి విడతల వారీగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 700 వరకు ఈవీ బస్సులు నడుస్తున్నాయి.

‘పీఎం..ఈ డ్రైవ్ పథకం’ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించే ఈవీ బస్సులను ‘గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్’ విధానంలో అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడపనుంది. వీటి డ్రైవర్లుగా ఒలెక్ట్రా సంస్థ ఉద్యోగులే  కొనసాగుతారు. కేవలం ఆర్టీసీ నుంచి కండక్టర్లు మాత్రమే ఉంటారు. దీని వల్ల  సిటీలోని ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ లకు స్థానికంగా పనిలేకుండా పోతుంది. అందుకే  వీరిని ఈవీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేయాలని యాజమాన్యం కోరుతోంది. ఇందుకు  సుముఖత వ్యక్తం చేసే వారికి సిటీలోనే  అవకాశం ఉంటుంది. 

ఒకవేళ  కండక్టర్లుగా పనిచేసేందుకు ఇష్టంలేని  డ్రైవర్లు, మెకానిక్ లను జిల్లాల్లోని డిపోలకు కేటాయించనుంది.  సిటీలో  సుమారు 4 వేల మంది ఆర్టీసీ డ్రైవర్లు, మరో 4 వేల మంది మెకానిక్ లు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కానీ, కండక్టర్లుగా 2వేల మందికే అవకాశం ఉండడంతో మిగిలినవారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా,  ఎలక్ట్రిక్ బస్సులను  అద్దె ప్రాతిపదికన కాకుండా పూర్తిగా ఆర్టీసీకి అప్పగించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని యూనియన్​ లీడర్లు  కోరుతున్నారు. అప్పుడే సంస్థ ఉద్యోగులకు జాబ్​ సెక్యూరిటీ ఉంటుందని అభిప్రాయపడ్తున్నారు.