మహిళా శక్తిని తక్కువ చేయొద్దు సిటీలో ఘనంగా.. ఉమెన్స్ డే ప్రీ-సెలబ్రేషన్స్

మహిళా శక్తిని తక్కువ చేయొద్దు సిటీలో ఘనంగా.. ఉమెన్స్ డే ప్రీ-సెలబ్రేషన్స్

సిటీ నెట్​వర్క్​, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం ప్రీ-సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. మహిళల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని, అన్ని రంగాల్లో వారు రాణించడం హర్షదాయకమన్నారు. జస్టిస్ మాధవి లత, పద్మశ్రీ పద్మజా రెడ్డితో కలిసి వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు అవార్డులు అందజేశారు. ఉప్పల్​లో  మల్కాజిగిరి కమిషనరేట్​ఆధ్వర్యంలో మహిళా పోలీసుల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. సీపీ అవినాష్ మహంతి హాజరై మాట్లాడుతూ.. మహిళా అధికారులు తమ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ సమస్యల పరిష్కారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆధ్వర్యంలో మడ్ ఫోర్డ్​లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించి కోటీశ్వరులుగా ఎదగాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. గండిపేట హైదర్షాకోట్​లోని ఎస్‌‌ఎంపీ స్కూల్‌‌లో జరిగిన వేడుకల్లో కరస్పాండెంట్ పట్లోళ్ల చంద్రకళారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.