రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే 99 రోజుల ప్రణాళిక : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే 99 రోజుల ప్రణాళిక : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక చేపట్టిందని పీసీసీ చీఫ్  మహేశ్  గౌడ్  స్పష్టం చేశారు. బాధ్యత, పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం.. ఈ మూడు సూత్రాల ఆధారంగానే రాష్ట్రంలో ప్రజా పాలనకు నాంది పలకనున్నామని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఉద్దేశంతో గ్రామసభల్లో వినిపించే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ‘ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజా పాలనను నినాదంగా కాకుండా కార్యాచరణగా మలిచేందుకు తమ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.

ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం పాలనకు కొత్తగా దిశానిర్దేశం చేయనుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పథకం అమలుకానుందన్నారు. పారిశుధ్యం, పెండింగ్  ఫైళ్ల క్లియరెన్స్, విద్యా రంగం ప్రక్షాళన, ప్రజల ఆరోగ్యం, వైద్య సేవల్లో నాణ్యత,  రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడం, మహిళా సాధికారత సాధించడం, పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను కాపాడుకోవడం, రోడ్డుభద్రత, ప్రమాదాల నివారణ.. వంటి ప్రధాన అంశాలను ప్రజలకు చేరువ చేస్తామని పీసీసీ చీఫ్ చెప్పారు. ప్రజలంతా పాల్గొని విజయవంతం  చేయాలని ఆయన కోరారు.