హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అత్యున్నత ప్రమాణాలతో 'ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను' ఏర్పాటు చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలకు కడుపు మంట ఎందుకని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గత పదేండ్ల పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేస్తే..సీఎం రేవంత్ బాగు చేస్తున్నారని తెలిపారు.
కుల వివక్ష లేని విద్యా విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంటే కేటీఆర్.. హరీశ్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ విద్యా విధానం గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యావేత్తగా కాకుండా కేసీఆర్ ఏజెంట్గా మాట్లాడుతున్నాడని దయాకర్ పేర్కొన్నారు. టీచర్ల గౌరవాన్ని కేసీఆర్ ప్రభుత్వం తగ్గిస్తే..తమ ప్రభుత్వం వారి గౌరవాన్ని పెంచి, ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నదని వెల్లడించారు.
