- ఫిబ్రవరి వరకు 5.44 కోట్ల మందికి జీరో బిల్లులు జారీచేసినం
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1930.66 కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చినయ్
- ఈఆర్సీ ఆధ్వర్యంలో ముగిసిన బహిరంగ విచారణ
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ఉండదని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తమ సంస్థ పరిధిలో 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,930.66 కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని ఈఆర్సీ భవన్లో చైర్మన్ జస్టిస్ డి.నాగార్జున్ అధ్యక్షతన 2026–27 సంవత్సరానికి సవరించి దాఖలు చేసిన సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ప్రతిపాదిత ధరలు, క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. దీనిలో జీహెచ్ఎంసీతో పాటు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల నుంచి వినియోగదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సంస్థ సీఎండీ జితేష్ సమాధానాలిచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం కోటి 20 లక్షల 95 వేల 963 మంది వినియోగదారులు ఉన్నట్టుగా తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 12 లక్షల 09 వేల 563 మంది వినియోగదారులు పెరిగారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 39,556 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టుగా తెలిపారు.
వాటిలో గృహ విద్యుత్ వినియోగం 23% ఉండగా, పారిశ్రామిక రంగం 31%, వ్యవసాయ రంగం 21%, కమర్షియల్ 16 %, ఇతర కేటగిరీల్లో 9 శాతంగా నమోదైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3న 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు కాగా అందులో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 4,421 మెగావాట్ల రికార్డు నమోదైనట్టుగా తెలిపారు.
రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా పంపిణీ
విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డి. నాగార్జున్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కేరెల్లికి చెందిన రైతు ఎన్. చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లికి చెందిన రైతు నలిగామ కనకయ్య విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే ఈఆర్సీ చైర్మన్ ఆదేశాలతో సంస్థ సిబ్బంది రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులు రెడీ చేయగా వీటిని బాధిత రైతు కుటుంబాలకు చైర్మన్అందించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ సభ్యులు కె. రఘు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
