T20 World Cup Final: వద్దూ.. మోడీ స్టేడియంలో మ్యాచ్ వద్దూ : పిటిషన్ ఫైల్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్

T20 World Cup Final: వద్దూ.. మోడీ స్టేడియంలో మ్యాచ్ వద్దూ : పిటిషన్ ఫైల్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్

T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ ఉత్కంఠభరిత పోరు రేపు (మార్చి 8న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత్ ఫైనల్‌కు అర్హత సాధించిన వెంటనే సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లలో ఈ స్టేడియం భారత్‌కు అంతగా కలిసి రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చాలని అభిమానులు వేడుకుంటున్నారు. 

ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే ఫైనల్ నిర్వహించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్  సమయంలో వాంఖడే స్టేడియంలో కనిపించిన అద్భుతమైన వాతావరణం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. దీంతో ఫైనల్ కూడా అక్కడే జరపాలని కోరుతున్నారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొంతమంది క్రికెట్ అభిమానులు ఫైనల్ మ్యాచ్‌ను ముంబైకి మార్చాలని కోరుతూ పిటిషన్‌పై సంతకాలు చేస్తుండటం కనిపిస్తుంది. అయితే ఇది కోర్టులో వేసే పిటిషన్ కాదు.. అహ్మదాబాద్ స్టేడియంపై ఉన్న భయాన్ని వ్యక్త పరచడానికే వాళ్లు ఇలా చేశారని టాక్. 

ఇదిలా ఉండగా భారత్ ఫైనల్‌కు చేరుకున్న తర్వాత ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. మార్చి 8వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా 3 వేల రూపాయల నుంచి ప్రారంభమయ్యే టికెట్లను 5 నుంచి 6 వేల రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. కానీ ఫైనల్ మ్యాచ్ రోజు మాత్రం ఈ ధరలు భారీగా పెరిగాయి. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలు సుమారు 7 ,349 రూపాయల నుంచి 8,371రూపాయల వరకు పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానుల ఉత్సాహం ఎంత ఎక్కువగా ఉందో క్లియర్ గా అర్థమవుతుంది.