సాధారణంగా వరుసగా విజయాలు సాధిస్తున్నప్పడు ప్లేయింగ్ 11లో మార్పులు చేయడానికి జట్టు యాజమాన్యం పెద్దగా ఆసక్తి చూపించదు. వరల్డ్ కప్ ఫైనల్ లాంటి బిగ్ మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు చేసే రిస్క్ అసలు తీసుకోరు. కానీ టీమిండియా మాత్రం వరల్డ్ కప్ ఫైనల్లో ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్టు ఖచ్చితంగా అభిషేక్ శర్మ కాదు.. ప్లేయింగ్ 11లో అతడి స్థానం దాదాపు ఖాయం. అయితే వేటు ఎవరిపై అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
నెల రోజులకు పైగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ 2026 ఆదివారం ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లో బలాబలాలను పక్కన పెడితే టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్టును ఓడించాలంటే మాత్రం శక్తికి మించి పోరాడాలి. అది కూడా సొంతగడ్దపై అహ్మదాబాద్‌లో ఓడిపోతే ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం. దీంతో టైటిల్ టార్గెట్‌గా ఫైనల్‌కు సిద్ధమవుతున్న టీమిండియా..ప్లేయింగ్ 11లో వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ వరుణ్ చక్రవర్తిని తప్పించనున్నట్టు తెలుస్తుంది.
ఫైనల్‌కు ముందు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ కప్‌లో బరిలోకి దిగిన వరుణ్ లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. అయితే కీలకమైన సూపర్-8 దగ్గర నుంచి ఈ మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. వరుణ్ బౌలింగ్‌లో బ్యాటర్లు అలవోకగా ఆడేస్తున్నారు.
జట్టులో ఉన్న ప్రధాన స్పిన్నర్ ఇలా పరుగులిస్తే భారీ డ్యామేజ్ జరుగుతుంది. సూపర్-8 నుంచి ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఒకసారి గమనిస్తే తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. మిల్లర్ వికెట్ తీసినా అప్పటికే సౌతాఫ్రికా భారీ స్కోర్ బోర్డుపై పెట్టింది. ఈ మ్యాచ్‌లో మిల్లర్, బ్రేవీస్ వరుణ్ చక్రవర్తికి చుక్కలు చూపించారు.
ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. పసికూన జట్టుపై కూడా ఓవర్‌కు 9 పరుగులిస్తూ నాలుగు ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ పై వరుణ్ కుదేలయ్యాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో విండీస్ బ్యాటర్లు 40 పరుగులు రాబట్టారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇంగ్లాండ్ బ్యాటర్లు ఈ మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్‌లో శివాలెత్తారు. నాలుగు ఓవర్లలో ఏకంగా 64 పరుగులు బాదారు. ఫామ్‌లో లేని బట్లర్‌ను బౌల్డ్ చేయడం తప్పితే ఈ మ్యాచ్‌లో వరుణ్ పూర్తిగా తేలిపోయాడు. నమ్ముకున్న బౌలర్ ఇలా 16 ఎకానమీతో బౌలింగ్ చేయడంతో ఇండియా భారీ స్కోర్ చేసినా టెన్షన్ తప్పలేదు.
వరుణ్ ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలం కావడం అతడిని బిగ్ మైనస్‌గా మారింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కావడంతో నాలుగు ఓవర్ల కోటాను వరుణ్‌ను ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఫైనల్లో కూడా వరుణ్ హ్యాండ్ ఇస్తే ఇండియాకు టైటిల్ చేజారే అవకాశం ఉంది. దీంతో వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఫైనల్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పితే ఈ టోర్నీలో ఆడలేదు. వరుణ్ చక్రవర్తి వరల్డ్ కప్ ముందు టాప్ ఫామ్‌లో ఉండడంతో పాటు జట్టుకు బ్యాటింగ్ డెప్త్ అవసరం గ్రహించి కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. అయితే ఫైనల్లో ఈ చైనా మన్ స్పిన్నర్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుల్దీప్ జట్టుకు ఎప్పుడూ భారం కాలేదు ఎప్పుడూ విఫలం కాలేదు. కెరీర్ అంతటా బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తూ వచ్చాడు.
ముఖ్యంగా ఆసియా కప్ ఫైనల్లో నాలుగు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ బిగ్ టోటల్ కొట్టకుండా కంట్రోల్ చేశాడు. అనూహ్యమైన టర్న్‌తో పాటు గూగ్లీలు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. ఈ ఒక్క మార్పు తప్పితే టీమిండియా సెమీ ఫైనల్లో ఆడిన జట్టుతోనే ఆడనుంది. మరి ఫైనల్‌కు ముందు వరుణ్ చక్రవర్తి పై వేటు వేసి తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్‌ను తీసుకొస్తారో లేదో చూడాలి.
