హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జతకట్టిన పేటీఎం 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జతకట్టిన పేటీఎం 

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పే టీఎం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు సంస్థలు డిజిటల్ చెల్లింపులు, లెండింగ్ మరియు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరిష్కారాలలో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టేందుకు ఉమ్మడిగా రంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల జారీ కోసం పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  జత కట్టాయి. 
వ్యాపారస్థులు, చిన్న వ్యాపార సంస్థలను టార్గెట్‌ చేస్తూ వీసాతో కలిసి ఈ కో బ్రాండెడ్‌ కార్డులను జారీ చేయనున్నారు. ‘‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..(బై నౌ.. పే లేటర్)’’, ఇప్పుడే కొనండి.. కంతుల వారీగా చెల్లించండి.. (ఈఎంఐలు) వంటి ఆప్షన్లతోపాటు రివార్డు పాయింట్లను పెద్ద ఎత్తున ఆఫర్ చేయడమే కాకుండా..ఈ రంగంలో ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని ఆఫర్లను ఈ కో బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డుల ద్వారా అందించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కో బ్రాండెడ్ కార్డుల జారీ వచ్చే నెల నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. దసరా, దీపావళి పండుగల సీజన్‌ ప్రారంభం అవుతుండడంతో కొత్త ఆఫర్లతో వీటిని విడుదల చేయనున్నారు. దాదాపు అన్ని రకాల స్కీమ్‌లను డిసెంబర్‌ కల్లా ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత కస్టమర్లను టార్గెట్‌ చేస్తూ ఈ కార్డులను మార్కెట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.