అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం ఒక హై- ఓల్టేజ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కు వద్ద ఊగిసలాడుతూ ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒకవైపు శాంతి చర్చల ఆశలు ఆవిరైపోవడం, మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తనదైన శైలిలో ట్రూత్ సోషల్ వేదికగా పోస్టులతో బాంబు పేల్చడంతో మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది.
ఇరాన్ ప్రతినిధులతో చర్చలకు వెళ్లాల్సిన తన బృందాన్ని ట్రంప్ హఠాత్తుగా రద్దు చేస్తూ.. ప్రయాణాలకే సమయం వృధా అవుతోంది, అక్కడ ఎవరి మాట ఎవరో వింటున్నారో కూడా తెలియడం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన రాగానే ఆదివారం రాత్రి బ్రెంట్ క్రూడ్ ఏకంగా 107 డాలర్ల స్థాయికి ఎగబాకింది. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ 2 కార్గో షిప్పులను స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు పరిస్థితులను మరింతగా దిగజారుస్తున్నాయి.
అయితే సోమవారం ఉదయానికి మార్కెట్ కొంత శాంతించి ధరలు 101 డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. అటు WTI క్రూడ్ కూడా 96 డాలర్ల రేటు వద్ద ట్రేడ్ అవుతూ అస్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 9 వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. హార్ముజ్ జలసంధి మూతపడటంతో సముద్ర రవాణా దాదాపు నిలిచిపోయింది. ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కూడా తగ్గేదేలే అంటున్నారు. దిగ్బంధనాలు, బెదిరింపుల మధ్య చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమ దగ్గరే అన్ని కార్డులు ఉన్నాయి, ఇరాన్‌కు మాట్లాడాలని ఉంటే ఫోన్ చేయడమే అని ట్రంప్ సవాల్ విసురుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నడుస్తున్న మైండ్ గేమ్ లో ఆయిల్ ధరలు ఎటువైపు దూసుకెళ్తాయోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వారం చివర్లో ఏదైనా శాంతి ఒప్పందం కుదురుతుందా లేక ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.

