- చైల్డ్ పోర్న్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై క్షమాపణలు
- డబ్బులు చెల్లిస్తే ఇల్లీగల్ కంటెంట్ కూడా
- బూస్ట్ చేసే చాన్స్ ఉండటంపై విచారం
- మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఆపరేషనల్
- లోపాలున్నాయని అంగీకారం
- ప్రధాని వీడియో తొలగింపు నేపథ్యంలో
- కేంద్రం సమన్లకు స్పందన
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వివాదం నేపథ్యంలో మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఆపరేషనల్ లోపాలు ఉన్నాయని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు. మెటా సోషల్ మీడియా వేదికలపై బాలల లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్‌ఏఎం), డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి, డబ్బులు చెల్లించినవారు ఇల్లీగల్ కంటెంట్ బూస్ట్ చేసుకునే అవకాశం ఉండటం వంటి లోపాలపై జుకర్‌బర్గ్ ఓ లేఖలో క్షమాపణలు కోరారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు క్షమాపణలు తెలిపినట్లు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో పిల్లల భద్రతను నిర్ధారించే బాధ్యత ఆయా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ఉందని కేంద్రం ఈ సమావేశంలో స్పష్టం చేసింది. చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ ద్వారా ప్రకటనల రూపంలో డబ్బు సంపాదిస్తూనే, మరోవైపు సేఫ్ హార్బర్ రక్షణను క్లెయిమ్ చేయడానికి వీలుపడదని తేల్చిచెప్పింది. జవాబుదారీతనం, కంటెంట్ నియంత్రణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరిగాయని, అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో తొలగింపు గురించిన ప్రస్తావన మాత్రం రాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, కంటెంట్ నియంత్రణలో చేసిన తప్పులను మెటా అంగీకరించింది. తమ ప్లాట్‌ఫారమ్‌లపై హానికరమైన కంటెంట్‌ను నిర్వహించిన తీరుపై విచారం వ్యక్తం చేసింది. కంపెనీ అధికారులను మళ్లీ గురువారం కూడా హాజరుకావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. యూజర్లకు ఏ కంటెంట్ కనిపించాలనేది అల్గారిథమ్‌లు చురుగ్గా నిర్ణయిస్తాయి కాబట్టి, ఐటీ యాక్ట్ కింద మధ్యవర్తులకు లభించే చట్టపరమైన రక్షణను మెటా క్లెయిమ్ చేయలేదని ప్రభుత్వ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
మెటాకు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు
ఫేస్‌బుక్ నుంచి ప్రధాని మోదీ వీడియో తాత్కాలిక తొలగింపునకు సంబంధించి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా మూడు రోజుల్లోపు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ నిషికాంత్ దూబే సోమవారం సోషల్ మీడియా దిగ్గజ ప్రతినిధులతో సమావేశంలో తేల్చిచెప్పారు. అనంతరం దూబే మాట్లాడుతూ.. సుమారు 5 గంటల పాటు మోదీ వీడియో అందుబాటులో లేకుండా పోయిందని మెటా అంగీకరించిందన్నారు. అలాగే, బాలల లైంగిక వేధింపుల మెటీరియల్(సీఎస్‌ఏఎం)ను అరికట్టడంలో మెటా వైఫల్యంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బుధవారం కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ జెన్ -జెడ్ అవుట్‌రీచ్ వీడియో తొలగింపు, ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం, మెటా ప్లాట్‌ఫారమ్‌లపై అధికారులు అనుచితమైనవిగా వర్ణించిన కంటెంట్ ఉనికిపై ఈ సమావేశం దృష్టి సారించినట్లు ప్రబుత్వ వర్గాలు తెలిపాయి.
