V6 News

పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: ఇకపై పుట్టిన రోజు, పెళ్లి రోజు సెలవు

పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: ఇకపై పుట్టిన రోజు, పెళ్లి రోజు సెలవు

హైదరాబాద్: పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తోన్న పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇకపై ప్రతి యేటా ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 27) ఉత్తర్వులు జారీ చేశారు.

 విధుల్లో ఒత్తిడి తగ్గించి కుటుంబంతో సమయం గడిపే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పోలీస్ సిబ్బంది మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతానికి ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. అత్యవసర పరిస్థితులు మినహా సిబ్బందికి ఈ రెండు రోజులు తప్పనిసరిగా సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. 

ముందస్తు దరఖాస్తు, ఆధారాలతో సెలవులు మంజూరు చేయాలని డీజీపీ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ పోలీస్ శాఖ, పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ పొరుగు రాష్ట్రం ఏపీ ప్రభుత్వం కూడా ప్రతి ఏటా పోలీసు సిబ్బందికి తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం ప్రత్యేక సెలవులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.