దక్షిణాసియాలో పెళ్లి అంటేనే ముందుగా బంగారం కొనుగోలుతో హడావుడి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. ఇప్పుడు బంగారం ధర చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 40% ధర పెరగడంతో.. మధ్యతరగతి ప్రజలు దీనికి దూరమౌతున్నారు. ఫలితంగా పెళ్లిళ్లలో ఒకప్పుడు కచ్చితంగా ఉండాల్సిందే అనుకున్న స్వచ్ఛమైన బంగారం.. ఇప్పుడు లగ్జరీ అయిపోయింది. దీంతో జనం చూపు 'వన్ గ్రామ్ గోల్డ్' వైపు మళ్లింది.
ఏమిటీ వన్ గ్రామ్ మాయ?
నిజమైన బంగారు సెట్ కొనాలంటే లక్షలు కుమ్మరించాలి. వన్ గ్రామ్ గోల్డ్ అంటే రాగి లేదా ఇత్తడిపై 24 క్యారెట్ల మెరుపును అద్దడమే. చూడటానికి అచ్చం అచ్చమైన పసిడిలాగే మెరిసిపోతుంది. వేల రూపాయల్లోనే పెళ్లి సెట్లు దొరికేస్తుండటంతో.. సామాన్యుడికి ఇది పెద్ద రిలీఫ్. జేబు ఖాళీ అవ్వదు, పైగా ఫంక్షన్‌లో మెరుపు తగ్గదు.
అమ్మాయిల మనసు.. ఇమిటేషన్ వైపు
ప్రస్తుతం మార్కెట్‌లో ఇమిటేషన్ జ్యువెలరీకి డిమాండ్ మామూలుగా లేదు. వెరైటీ డిజైన్లు, ట్రెండీ లుక్స్‌తో ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. ముంబైలోని జవేరీ బజార్ వంటి పెద్ద మార్కెట్లలో సైతం కస్టమర్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ నగలే ముద్దంటున్నారు. దీనివల్ల సేఫ్టీ కూడా ఎక్కువే. దొంగల భయం లేదు, పోగొట్టుకున్నా ప్రాణం పోదు. అందుకే 2025లో భారత దేశంలో పసిడి నగల డిమాండ్ 24% తగ్గిందంటే పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బార్డర్ దాటిన సెగ..
ఈ పరిస్థితి కేవలం మన దగ్గరే కాదు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా ఇంచుమించు ఇదే సీన్. అక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల జనం 18 క్యారెట్ల గోల్డ్ లేదా గోల్డ్ ప్లేటెడ్ నగలకు మొగ్గు చూపుతున్నారు. పాత బంగారాన్ని కొత్త మోడల్స్‌గా మార్చుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్నారు.
బంగారం లేకపోతే పెళ్లి సంబంధాలు ఆగిపోయే పరిస్థితి శ్రీనగర్ వంటి చోట్ల కనిపిస్తుంటే.. ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాలు మాత్రం గొప్ప నిర్ణయం తీసుకున్నాయి. పెళ్లిళ్లలో బంగారం వినియోగానికి పరిమితులు విధించి, అప్పుల పాలు కాకుండా మధ్యతరగతిని కాపాడుతున్నాయి. మెుత్తానికి గోల్డ్ అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. అది తరతరాలుగా వస్తున్న ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ భారం కాకూడదంటే.. మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెతను పాజిటివ్‌గా తీసుకుని వన్ గ్రామ్ గోల్డ్‌తో పెళ్లి వేడుకను ఎంజాయ్ చేయడమే ప్రస్తుతానికి బెస్ట్ ఐడియా.

