- రూ. 10 లక్షల ఆస్తి నష్టం.. అంబర్‌పేట ఛే నంబర్లో ఘటన
అంబర్పేట్, వెలుగు: అంబర్‌పేట ఛే నంబర్ జంక్షన్ వద్ద ఉన్న మహీంద్రా, రెనాల్ట్ సర్వీస్ సెంటర్లలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సర్వీస్ సెంటర్‌లోని ఎయిర్ కండిషనర్ (ఏసీ) యూనిట్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. టైర్లు, ఇంజిన్ ఆయిల్ డబ్బాలు, పాత వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో మంటలు వేగంగా విస్తరించాయి. దాంతో ప్రమాదం తీవ్రరూపం దాల్చింది. సుమారు మూడు గంటల పాటు దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.
దాంతో స్థానికులు ఊపిరాడక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ముషీరాబాద్, మలక్‌పేట, గౌలిగూడ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించారు. వాటర్ ట్యాంకర్ల సహాయంతోనూ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో కార్ల విడిభాగాలు, ఆయిల్ నిల్వలు కాలిపోవడంతో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య తెలిపారు. అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

