DC vs RCB : ఐపీఎల్ 2026లో భాగంగా కాసేపట్లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. మరి ఈసారి సొంత గడ్డపై ఢిల్లీ ఆధిపత్యం చాటుతుందా? లేక ఆర్‌సీబీ ప్రతీకారం తీర్చుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కోహ్లీతో ఓపెనింగ్ చేసేది ఎవరు?:
ఆర్సీబీ జట్టుకు ప్రస్తుతం ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు.. నెట్ ప్రాక్టీస్ సమయంలో అతను గాయపడినట్లు మెంటర్, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్పష్టం చేశారు. సాల్ట్ స్థానంలో గత మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించని జాకబ్ బెథెల్ ఆడే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీకి జోడీగా బెథెల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ పై బెంగళూరుదే పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య మొత్తం 34 మ్యాచులు జరగ్గా, ఆర్సీబీ 20 మ్యాచులలో విజయం సాధించగా, ఢిల్లీ మాత్రం కేవలం 13 మ్యాచులలో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే 2021 నుండి జరిగిన 9 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఏకంగా 6 సార్లు విజయం సాధించింది.
ఏ జట్టు గెలుస్తుందంటే?:
గత సీజన్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన ఆర్‌సీబీ, ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి ఫుల్ ఫామ్‌లో ఉంది. విరాట్ కోహ్లీకి ఇది సొంత మైదానం కావడంతో ఆర్‌సీబీ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇక అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ వరుస ఓటములతో సతమతమవుతోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 265 పరుగులు చేసినా కాపాడుకోలేకపోవడం వారి బౌలింగ్ వైఫల్యాన్ని సూచిస్తోంది.

