విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ.. స్నేహానికి సరికొత్త అర్థాన్ని ఇస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన చిత్రం '3 ఇడియట్స్'. 20-09లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ రికార్డులనే కాదు .. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. గత కొంతకాలంగా ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా దీనిపై ఆమీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.
కథ ఎలా ఉండబోతోంది?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ప్రస్తుతం ‘3 ఇడియట్స్ 2’ స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారని ధృవీకరించారు. హిరానీ నాకు కథ వినిపించారు, అది అద్భుతంగా ఉంది. మొదటి భాగం ముగిసిన పదేళ్ల తర్వాత ఆ ముగ్గురు స్నేహితుల జీవితాలు ఎలా మారాయి? రంచో మళ్ళీ తన మిత్రులను ఎలా కలుసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ కథ సాగనుంది. అభిజిత్ జోషి, హిరానీ కలిసి అసాధారణమైన హ్యూమర్, ఎమోషన్స్‌తో దీనిని సిద్ధం చేశారు అని ఆమీర్ వెల్లడించారు. తాను మళ్ళీ ఫున్షుక్ వాంగ్డు (రంచో) పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఒరిజినల్ కాస్ట్ మళ్ళీ కనిపిస్తారా?
ఈ సీక్వెల్‌లో ఆమీర్‌తో పాటు ఆర్. మాధవన్ (ఫర్హాన్), శర్మన్ జోషి (రాజు), కరీనా కపూర్ కూడా నటించే అవకాశం ఉంది. గతంలో వీరు ముగ్గురు ఒక యాడ్ ఫిల్మ్ కోసం కలిసి కనిపించినప్పుడు, అది సినిమా కోసమేనని అభిమానులు ఆశపడ్డారు. ఇప్పుడు ఆ ఆశ నిజం కాబోతోంది. ఈ చిత్రం లడఖ్‌కు చెందిన విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం నుండి స్ఫూర్తి పొంది నిర్మించిన తొలి భాగానికి కొనసాగింపుగా రానుంది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా..
రాజ్‌కుమార్ హిరానీతో చేయాలనుకున్న ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే నిలిచిపోగా, ఆమీర్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో ఆమీర్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే తన కుమారుడు జునైద్ ఖాన్ సినీ అరంగేట్రం చేస్తున్న ‘ఏక్ దిన్’ సినిమా ప్రమోషన్లలో ఆమీర్ బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.
2009లో రూ.200 కోట్ల మార్కును దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన ‘3 ఇడియట్స్’, ఇప్పుడు సీక్వెల్‌తో రాబోతుండటం సినీ వర్గాల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ మళ్ళీ థియేటర్లలో నవ్వులు పూయించడానికి రంచో గ్యాంగ్ సిద్ధమవుతోంది..

