తెలంగాణ విద్యార్థుల వీసాలను పెంచండి.: సీఎం రేవంత్

తెలంగాణ విద్యార్థుల వీసాలను పెంచండి.: సీఎం రేవంత్
  •     అమెరికా రాయబారి సెర్జియో గోర్‌‌తో రేవంత్ రెడ్డి భేటీ
  •     వీసా ఇంటర్వ్యూల స్లాట్ల పెంపు, ఇతర అంశాలపై చర్చ 


న్యూఢిల్లీ, వెలుగు: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని,  వీసా అపాయింట్‌‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని భారత్‌‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌‌ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు. అలాగే, అమెరికా హెచ్1 బీ వీసా ప్రాసెసింగ్‌‌, రెన్యువల్‌‌, వీసా స్టాంపింగ్‌‌ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని రిక్వెస్ట్ చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో.. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని సీఎం ప్రస్తావించారు. అలాగే, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు.

వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్‌‌ సైన్సెస్‌‌, ఫార్మా, స్టార్టప్‌‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే, అమెరికా వర్సిటీలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని సీఎం గుర్తు చేశారు. దేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి చూపిన ఆసక్తిని సీఎం అభినందించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చినట్టు సీఎంఓ ఒక ప్రకటనలో వెల్లడించింది.