భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లిలో విద్యుత్ లైన్ పై పిడుగు పడి ఊరంతా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కొద్దిసేపు వర్షం పడింది.
ఈ క్రమంలో గ్రామంలోని విద్యుత్ లైన్ పై పిడుగు పడడంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో 35 మీటర్లు, 10 కూలర్లు, 15 టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, గడ్డివాము కాలిపోయాయి. ఊరంతా కరెంట్ షాక్ రావడంతో గ్రామస్తులు రోడ్ల మీదికి పరుగులు తీశారు.
షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

