- రిజల్ట్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 45 పీజీ ప్రోగ్రామ్‌లకు గాను నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో 93.54 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో కాకతీయ వర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డి, టీజీసీహెచ్‌ఈ వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తంతో కలిసి కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సీపీగెట్ రిజల్ట్‌ను రిలీజ్ చేశారు. జులై 8 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాల్లో సీపీగెట్ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షకు మొత్తం 52,697 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 45,462 (86.3%) మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో 42,526 మంది క్వాలిఫై అయ్యారు. కోర్సుల వారీగా చూస్తే ఎంఈడీలో అత్యధికంగా 99.81 శాతం మంది అర్హత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎంఎస్సీ న్యూట్రిషన్(99.67%), ఎం.ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (99.64%) నిలిచాయి.
అత్యధిక మంది ఎం.కామ్‌లో క్వాలిఫై
సీపీగెట్ ఫలితాల్లో సంఖ్యపరంగా అత్యధిక విద్యార్థులు క్వాలిఫై అయిన కోర్సుల్లో ఎం.కామ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కోర్సులో అత్యధికంగా 3,757 మంది విద్యార్థులు పీజీ ప్రవేశాలకు అర్హత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో 2,823 మంది, ఎంఎస్సీ జూవాలజీలో 2,787 మంది, ఎంఏ ఇంగ్లీష్‌లో 2,785 మంది, ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో 2,749 మంది, ఎంఏ తెలుగులో 2,458 మంది, ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో 2,305 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కాగా, మూడో వారంలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడతామని అధికారులు తెలిపారు. కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, సీపీగెట్ కన్వీనర్ రాజేందర్, ప్రొఫెసర్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
