హైదరాబాద్/ఆసిఫాబాద్, వెలుగు: కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను ఆ పదవి నుంచి తప్పించి, కాంగ్రెస్ ను రక్షించాలని జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం గాంధీ భవన్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ నాన్ లోకల్ అని, మండల కమిటీ అధ్యక్షుల నియామకంలో ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు.
ఆమెను ఆ పదవి నుంచి తొలగించి ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను కాపాడాలని, సీనియర్ నాయకులను గుర్తించి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని బ్యానర్లు, ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. ఇదే సమయంలో గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని బయటకు వెళ్తున్న మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఆమె సున్నితంగా తిరస్కరించారు. జిల్లా ఇన్చార్జీని కలవాలని, ఈ అంశంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
