- ఆదివాసీలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా
- వారికి జర్మన్ భాష నేర్పించి, విదేశాల్లో ఉపాధి కల్పిస్తం
- ఆగస్టు 15న కొత్త పెన్షన్లు అందిస్తామని వెల్లడి
- మంచిర్యాల జిల్లా జైపూర్‌లో కుమ్రం భీమ్ విగ్రహం ఆవిష్కరణ
కోల్‌బెల్ట్/ చెన్నూరు/ జైపూర్, వెలుగు: ఆదివాసీ యువతకు జర్మనీలో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందుకోసం టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాష, స్కిల్స్ నేర్పిస్తామని చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. జైపూర్ మండల కేంద్రంలో కుమ్రం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉదయం చెన్నూరు మున్సిపల్ వార్డుల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు. అనంతరం చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో రివ్యూ చేశారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు కుమ్రం భీమ్ ఆశయ సాధన కోసం ఆదివాసీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుమ్రం భీమ్‌లాగా పోరాడాలన్నారు. ఎవరైనా కుమ్రం భీమ్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసీల్లో చదువుకునే వారి సంఖ్య పెరుగుతోందని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆదివాసీలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. కమ్యూనిటీ హాల్ కావాలని కోరితే భూమి కేటాయించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చానని, హాల్ నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. చెన్నూరు మండలంలో దాదాపు వెయ్యి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మరోవైపు, ఆగస్టు 15న కొత్త పెన్షన్లు సాంక్షన్ చేయనున్నట్లు వెల్లడించారు.
పనుల్లో నాణ్యత పాటించాలి..
మార్నింగ్ వాక్‌లో భాగంగా చెన్నూరులోని అంబేద్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మంత్రి వివేక్ పరిశీలించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైనేజీ, తాగు నీరు, శానిటేషన్ సమస్యలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం మధున పోచమ్మ దేవాలయాన్ని మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. చెన్నూరు మండలం బావురావుపేట గ్రామ ఉపసర్పంచ్ దుర్గం లింగమ్మ కుమార్తె అక్షయ ఇటీవల మరణించగా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు వనజారెడ్డి, మల్లికార్జున్, రాఘవేంద్ర, సదానందం, ఎంపీడీవోలు శ్రీపతి బాపు, మోహన్, నాగేశ్వర్ రెడ్డి, వీణా, చెన్నూరు, కోటపల్లి, జైపూర్ సీఐలు భన్సీలాల్, కృష్ణ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
